శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము -4 (మూలము: శ్రీసాయి సచ్చరిత్రము.)

శ్రీగణేశాయనమః,శ్రీసరస్వత్తైనమః,సమర్ధసద్గురు శ్రీసాయినాథాయనమః.

ముందుమాట!

శ్రీసాయిలీలలను  గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ  శ్రీ సాయిలీలలు  గేయ రూపంలో  వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకువీలుకానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల  భావసందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా   చరిత్ర పారాయణజేయువారు  శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము  పారాయణ జేసి   ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము  సులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది.  శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు  మనఃస్ఫూర్తిగా  ప్రార్ధిస్తున్నాను. 

నాల్గవ భాగము  (అధ్యాయములు 23-30)

ఇరువదిమూడవ అధ్యాయము

భక్తులదైవము బాబాయైనను , భగవంతు దాసుగ తాను బలుకుదురు 
తారక తీర్థులు తామైయొప్పిన, వినయశీలముల వేరు లేరుగ
పరుగుపందెముల కోరనివారు, పరులపొందును కాదనువారు
జీవులందరిలొ  దివ్వెనుజూతురు, జ్ఞానదివ్వెల వెలిగింతురు వారు

యోగము నేర్చిన దారిదొరకునా ? అహపుకొంగులో ఆత్మ నిండునా ?
వేదము శాస్త్రము నెరిగిన శాస్త్రి, అనుభవ శూన్యులై బాబను జేరిరి
ఉల్లితొ రొట్టెను తినుటనుజూసి , బాబనైజమిదేమని దలచిరి
" సమర్థులు తిండికి బందీకారు " నానతొ సూటిగ బాబ పలికిరి

మంత్రము మించిన బాబా మాటది, మాటలకందని శక్తివంతమది
మాటతొ శ్యామా విషము విరచిరి, మంత్రము మించిన బాబా మాటది!
కలరా వేళల కట్టెల కొనిరి , కట్టడిజేసెడి శక్తి యెవరికి ?

గురునిమాటపై గురినినిలుపరే, గురుని యాఙ్ఞయే పరమధర్మమని 
బాబ వాక్కుయె బ్రహ్మవాక్కని , మేక నరకుటకు కాక నిలిచెను
ఉత్తమ మధ్యమ సాధారణులు, శిష్యులు మూడు మూడు రకములు
గురునిభావము మదినూహించి , వేగ జేయుటయె యుత్తమ గుణము.

బాలహృదయుడు షిరిడీ సాయి, బాలలమిత్రుడు షిరిడీ సాయి
బాలకృష్ణుడు షిరిడీ సాయి, బ్రహ్మతేజుడు షిరిడీ సాయి

శంభోశంకర షిరిడీసాయి, హరిహరరూపుడె  షిరిడీసాయి.  

ఇరువదినాల్గవ అధ్యాయము

బాబా చూడగ బ్రహ్మానందులు ,
సమర్థ గురువులు సాయిపుంగవులు
చిత్తచోరులు మురళీధరులు,
చతురులు తామే హాస్యప్రియులు

ఆదివారమది సంతరోజది
బాబసేవలొ పంతుయుండెను
ఆతనిజేబులొ శనగలుండగ
చతురవాక్యముల బాబ బలికిరి

ఒక్కడు తినెడి దుర్గుణమున్నది
పక్కవారల పంతు మరచును
ఎవరులేరని వంకలు బలుకును
నా యునికి మరచి తాభుజించును

బాబ చతురతా సూక్ష్మమున్నది
పంచేంద్రియముల కంటె ముందుగ
విషయానుభవము మనసు పొందును
సాయికర్పణా  భావమె శ్రేయము

సంకల్పములెల్ల సాయికర్పణము
చేయుటలోనె దోషము శూన్యము
సంకల్పములా సాయిపొందగ
వాటిబలములే వృద్ధినొందులె !

సుధాముడు చూడగ స్వార్థపరుండు,
శ్రీకృష్ణుని మరచి తా భుజించెను
అంతకుతో డసత్యములాడి,
దైవవశము దారిద్ర్యము పొందెను

మాశీబాయి సేవవేళల
భక్తులామెను హాస్యమాడగ
సటకను  తమపొట్టన గుచ్చి
మిగులక్రోధముతొ  భయముగొల్పిరి

భక్తులపైనా మాతృప్రేమది, ఒక్కమాటను యోర్వ లేరుగా!
బాబ ప్రేమకు పాత్రులగుటయె,మానవజన్మకు సార్ధకంబులే !

ఇరువదిఐదవ అధ్యాయము

పూర్ణహృదయముతొ  విశ్వసింపగ  , మనసుకోవెల  సాయినిలుతురు
ఆత్మనివేదన చేయు భక్తునకు , అంతర్యామిగ రక్షణ నిత్తురు !

పాలుత్రాగుటకు పరుగులెత్తకు , నిలబడి నీరు త్రాగుటే మేలు
సగమురోట్టితొ తృప్తినొందుము,లక్షలునిన్ను లక్ష్యము జేర్చవు
పత్తివ్యాపారము లాభసాటియని , సాటిస్నేహితుడు దాముకు తెలుప
బాబ యనుమతికి లేఖవ్రాయగ  , చదువక బాబా లేఖనెరిగెను

బాబను చూడగ దామువెడలెను , సొత్తున భాగమివ్వగ దలచెను
యాతనిభావము నెరిగిన బాబా, ఇహపాశంబులు వలదని పలికెను
పత్తిబేరము కోరిజేయగ , దండుగ మెండుగ పొందెద వనుచు
దాము దారి మళ్లించెను బాబ , దూరదృష్టి  కాపాడెను బాబా!

బాబా ఆశీస్సు ఫలములతోటి , సంతానంబునె పొందెను దాము
సాయినాథు శరణాగతి కోరి , నిత్య రక్షణను పొందెను దాము.
మామిడిపూతయె మెండుగ పూయును, ఫలమయ్యేది ఎంత యుండును?

ఇరువది ఆరవ అధ్యాయము

మాయనుండిన సత్యము నెరుగము , చీకటివేళల కంబమె దెయ్యము
రజ్జువె సర్ప రూపుగూర్చును, సద్గురుకృపతొ నిజము తెలియును

ఆనంద బాష్పాల పాదముల కడిగెదము, ప్రేమచందనము చక్కగా దిద్దెదము
దృఢవిశ్వాస వస్త్రమే నిత్తుము , సాత్వికభావనలె  పూజకమలాలుగ
ఏకాగ్రచిత్తమే ఫల నైవేద్యము, భావతరంగాలే పన్నీటి జల్లులు
భక్తిభావనే బాబకు మొలతాడు, శిరమొంచి  పాదాల మొక్కుటే  మనగతి

అంతర మననము చేయుము బాబ, నిత్యానిత్యము తెలుపుము బాబా
చిత్తవృత్తులా కట్టడి సేయరె , చంచలచిత్తపు హయమును గట్టరె
" నమ్మినగురువునె నెమ్మదినిలుపుము , పట్టినపట్టును సడలింపకుము!"
పంతుతొ బాబా ప్రేమగ బలికెను , ఎల్లరికిదియే వర్తించునుగా!

పితళే పుత్రుని మూర్ఛ రోగము, బాబ దీవెనల దూరమాయెను
రెండురూకల పూర్వమిచ్చెనని , అక్కల్ రాజుగ సాయియొప్పెను
కష్టములెల్ల యూరకరావు , ఆత్మహత్యతొ అంతముగావు
జన్మలెత్తవలె కర్మలు జెల్లగ , అంబాడేకరు కనుభవమాయెను!  

ఇరువది ఏడవ అధ్యాయము

సాగరస్నానము ఎంతో పున్నెము, ఎన్నోపుణ్య నదుల స్నానము
సద్గురుపాదము సమీపదైవము, యెల్లదైవముల పవిత్ర కలశము!

రాతియె నాతిగ మారెనుగ, రామపాదము సోకగనె
వెదురు వేణువుగ గానమిడె , మురళీధరుని అధరమంటగనె
పరశువేదియె తాకినంతనె , లోహరూపము కనమెగ
సాయికరముల దీవెన గ్రంధము, చదువువారలకు బలముకదా!

విష్ణుసహస్రము చదివినగాని, రామదాసికి మనసు చంచలము
శ్యామతొ మిగులవాదమాడెను, చిన్నపొత్తము శ్యామపొందగ
నోటితొచదివిన ఫలితమురాదు, రోజూచదివిన వివరము తెలియదు
గ్రంథసారమును రంగరింపవలె, మనసు పలుకులా పనుల జూపవలె!

భక్తులతోడి బాబా బంధము, జనమ జనమలా చిక్కటిగంధము
ఖాపర్డే సతి విందు భోజనము, బాబ భుజింపగ యతిశయప్రియము
బ్రహ్మజ్ఞానము  మార్తాండతేజము , మిణుగురు సమమే పుస్తక జ్ఞానము
గండపెండెర పండితులైనను , పొందగలిగిరె యాకైవల్యము?

ఖాపర్దే  బూటీ నూల్కరు చూడగ , విద్యావంతులు వినయశీలురు
సాయిదేవులా సన్నిధిలోన , నోరుమెదపరు పల్లుబలుకరు
విద్యాబుద్ధులు ఎన్నియున్నను, వినయవిధేయత మిగులనుండవలె
సత్యము కోరే సాధకులెల్లరు, సద్గురుసాయిని శరణు వేడరె!


ఇరువది ఎనిమిదవ అధ్యాయము

సాయిదేవులు పరశువేదిలె , లోహజీవుల మార్చివేతురె
అయస్కాంతమె వారి తలపులు  , చిరుపిచ్చుకలుగ మనల లాగులె
తండ్రిజూడ జన్మదాత , సద్గురునిడు పునర్జన్మ
తండ్రిసాయము కొంతవరకె  , సాయిసాయము యెల్లకాలము

పిచ్చుక లక్ష్మీచంద్
స్వప్నమందున దరిశనమిచ్చి , దాసగణు భజనకు పిలచి
శంకరరావును  ఇంటికి బంపి , లక్ష్మీచందును షిరిడి కీడ్చిరి
" తనను చూడగ అప్పుఏలను? , చూడవచ్చుచు శంక యేలను ?
  కలలొ కనబడి రమ్మని పిలిచితి , తలచిన కోరిక నెరవేరినదా? "
సాయి సర్వజ్ఞతకు  చంద్ చకితుడాయెను
సాంజా ప్రసాదము సాయితొ తినెను
తనదు హృదయము చదువు బాబ గని
శరణుకోరె  సాయి చరణమును!

మరొక పిచ్చుక  బెరహంపూర్ మహిళ
కలలొ కనపడి కిచిడి కోరిరి,
షిరిడికి లాగి కిచిడినందిరి
అచ్చెరువందగ ఆరగించిరి
భక్తులపైన ప్రేమ ఎంతయో !

పెద్దపిచ్చుక మేఘశ్యాముడు
పరమశివుని భక్తుడు  మేఘ నామధేయుడు
వర్ణమందు బ్రాహ్మణుడు, సాఠె  వంటసేవకుడు
షిరిడి యాత్ర సేయ వెడలె , శివుడె సాయీయనగ దలచి
యవనిధర్ము సాయిగ , మార్గమధ్యంబు వినియె

అనుమానము పెనుభూతమెసాయిజూడ సంశయించె
సాఠె మిగుల ప్రోత్సహించి , గురునిజూడ షిరిడి బంపె
సాయిదేవ సేవజేయ మేఘ మజీదు జేర
ఉరుముఉరిమె  పిడుగుపడియె, సాయిదేవులుగృలాయె

" అగ్రజాతి బ్రాహ్మణుడావలదు నన్ను చూడ వలదు
  వెనువెంటనె  వెడలు వెడలు."  సాయిబలికె  పరుషముగ
మేఘ మిగుల వ్యధనుపొందె , సాయితనదు మనసు నెరుగ
త్రయంబకము తానుజేరి, హరునిమొక్కె మేఘయచట

వర్షార్ధము శివునిసేవ, గురునిజూడ షిరిడి మరలె
బాబ కరుణించెలె , సాయి సమ్మతించెలె!
ఆత నంతరంగము పరిశుద్ధము జేసెలె!
సాయియందు శివునిరూపు , మేఘ మేఘ చూడసాగె

ప్రియముమీర బిల్వపత్ర , సాయిపూజ నతడు జేసె
షిరిడి ఆలయంబుల దేవార్చన ముందుజరిపి
సాయిసేవ మేఘజేయు , పాదజలము తానుగ్రోలు

అంతట రోజు మేఘ ,
ఖండోబా సేవ విడువ , మేఘసేవ సాయి విడచె
మరలగుడికి వెడలబలికెదేవళ ద్వారంబుతెరియ

మకరసంక్రాంతి శుభతరుణమున,
చందనపు సేవతోడ తనశివునకు అభిషేకము 
మేఘమదిలొ సంకల్పము, మిగుల మిగుల సంకల్పము
వలదు వలదు అభిషేకము, శిరము దడుప సాయి బలికె
పూర్ణఘటము మేఘ వంచె, " హరగంగ " యనుచు పొంగున
దేహమంత పొడిగ నిలువ , శిరసునకభిషేకమాయె!
సాయిలీల కనులగని , పరవశించె మేఘుడచట.

మజీదులోన వాడలోన  సాయిపూజ మిగులజేసె
ఏకవర్షమటులసాగె   మేఘయెదలొ  సాయినిలువ!

శుభోదయాన సాయి  మేఘహృదయాన  శివుని ప్రతిష్టింప దలచె!
కనులుమూసి మెలకువలొ  మేఘ తనశయనమందు
కాంచె సాయి యక్షింతల జల్లి, త్రిశూలము చిత్రింపబలుక
కనులు దెరువ  రూపులేదు, అక్షింతలె యటునిటుల
కలయేమో యటుల దలచి, సాయిజూడ  మేఘవెడలె

" త్రిశూలము చిత్రింపగ   నా పలుకులు వినలేదా?
  కలకాదది నాతలపది , గది జేరెద యెదజేరెద
  మదినిలిపిన వారి యెదల  సద్గురువుగవిలసిల్లెద."
మజీదునా  సాయిబలికె మేఘునకతి ప్రియముగ
మేఘ వాడ తిరిగిజేరె గురునిపలుకు శిరము దాల్చి
త్రిశూలము చిత్రించె సాయిచిత్రపటము చెంత

చిత్రమదియె చూడరె , శివలింగమరుదెంచెలే!
బాబకివ్వ  రామదాసి పూననుండి తెచ్చెలే,
శంకరు డరుదెంచెలె , ప్రేమమీర  జూడమని
మేఘునకందించె సాయి, శివా రూపంబును 

దీక్షితు తన ధ్యానమందు రూపునె  గాంచెలె
మేఘరాక శివునితోడ, మిగులశుభము గూర్చెలె
సాయి శివుని ప్రతిష్టించె  త్రిశూలపు చెంతనే
శివరూపము తానుగ , ఆభక్త హృదయంబున
నిత్యసాయి సేవలో, మేఘ ముక్తి పొందేలే

సాయిభక్తులెల్లరకు, తారలాగ నిలచెనులే ! ధ్రువతారలాగ  నిలచెనులే !!

ఇరువది తొమ్మిదవ అధ్యాయము

వేరు వేరు పిచ్చుకలకు వేరు వేరు పాశములు
మదరాశి  భజనవారు కాశియాత్రకెడలుచు
సాయీశుని కానుకలకు వేంచేసిరి ద్వారకమయి
భావమెటుల పొసగునో , అనుభవంబటుల గలుగు
రామునిగ కన్పించెసాయి  యజమానురాలికి

భజనజేసినంతయేల , భక్తికలుగుటంత సులువా ?
పైసలకై సాయి జూడు యజమానికి ఏమిలేదు
స్వప్నమందు శక్తిజూపె , సాయిసులు శక్తిజూపె
పరమాత్మగ బాబజూసి , ప్రణతులిడెను యజమాని
సాయీశుల ఆసిసుల, కాన్క లందె యజమాని !

గ్రహకూటమి బలిమికన్న , సాయి అనుగ్రహమె మిన్న
సావిత్రిపుత్రునికి  వైద్య విద్య లభ్యమాయె   
జోతీషుల పలుకులెల్ల కల్లలాయె, డొల్లలాయె
గురుదేవుల దీవెనలే సత్యమాయె, సత్యమాయె  !

భక్తుడెన్నడైన మరువ, గురుదేవులు మరతురా?
కలనైనా కనిపింతురు , షిరిడికైన రప్పింతురు
స్వప్నమాయె హాటేకు , బికనీరు వాసుడతడు
స్వయంపాక దక్షిణల సాయికివ్వ కల చెదిరె
మిత్రునితొ డబ్బుపంపి చిక్కుడులతొ పాకమివ్వ
ప్రేమమీర యారగించి సాయిదేవ  కరుణించె

శంఖునందు జలముచూడ, తీర్థమగుట జగమునెరుగు
సాయి చేయితాకినంత , రూకయగును పావనము
హాటే పొందె సాయీశుల , ఆసిసుల నాణెము
మిగుల మిగుల పొంగిపోయె , ఏమి యతని భాగ్యము!

ముప్పదవ అధ్యాయము

జనమ జనమ బాంధవుడు, సాయిదేవ బాంధవుడు
తనవారల మనసులోకి చొరవజేసి వసియించు
మనసంతా తానెనిండు , మార్గమెంతొ జూపించు
షిరిడికేమొ పడియీడ్చు , సూదంటుగ తానొప్పు!
పోరాటజీవనమున, ఆరాటము తగ్గించు
వీరాటా సాయిదేవ  పారాడు బిడ్డలము!

సప్తశృంగి పూజారి  కాకాజీ వైద్య 

సర్వశక్తిమయుడు సాయి, అప్రమత్తుడెపుడు సాయి
చిత్తమందు రూపునిలుప బంధమేయు బాంధవుడు
వినుడు వినుడు భక్తులార , సాయిచరణ చిత్తులార
షిరిడిజేరు పిచ్చుకల , వింత వింత గాథలు

శక్తిరూపి సప్తశృంగి , పూజారి కాకాజీ
వాణియందు వసియించె , సప్తశృంగి సేవించి
ఈతిబాధలధికమాయె , మనఃశాంతి లుప్తమాయె
తల్లియొడిని తానుజేరి , హృదయపీడ విన్నవించె

మాతృత్వము పొంగిపొరలె , సప్తశృంగి స్వప్నమాయె
బాబాజీ సన్నిధిలొ, పరమశాంతి పొందబలికె 
" త్రయంబకేశుడే బాబ " , వైద్యయటుల భావించి
దశదినములు తానుగడపెపావన త్రయంబకమున
భక్తిశ్రద్ధ అభిషేక  రుద్రార్చన లొనరించె

పరమశివుని ప్రీతిపొంద, పరివిధముల స్థుతియించె
మదియలజడి తొలగకుండె , వైద్య మిగుల వ్యధను పొందె
తల్లిగుడిని వాణిజేరి , మరల మరల ప్రార్థించె
అమ్మమనసు వెన్నలె  , మరల స్వప్నమాయెలె
బాబయనగ  షిరిడిబాబ చెంతజేర బలికెలె

షిరిడి జేరుటెటుల ? బాబజూతు నెటుల ?
కాకాజీ వైద్యమదిలొ సందేహము యావహించె
భక్తుడు నిమిత్తుడు, సద్గురునిదె సంకల్పము
ప్రేరణిచ్చి  గురువు గురువు  మార్గమేల జూపకుండు?

అంతలో వింతగ ....
బాబ సాయిప్రియభక్తుడు , శ్యామనామధేయుడు
చుక్కతెగి పడిన పగిది వైద్యగేహమరుదెంచె

అదెలాగో  చూద్దాం...
శ్యామ అపుడు అర్భకుడు, తీవ్రవ్యాధి పీడితుడు
కులదేవత సప్తశృంగి  అభయంబుతొ శుభము పొందె
శ్యామతల్లి మాట మరచిసప్తశృంగి మొక్కు విడచె
కొంతకాలమటుల సాగెవక్షవ్యాధి తానుపొందె 

సప్తశృంగి మరలమొక్కె , రజితవక్ష మివ్వబలికె
వ్యాధిమరలె  యామె మరచె , రెండుమొక్కు లటుల నిలచె
కాలచక్రగమనములొ   శ్యామతల్లి జగము విడచె
సప్తశృంగి మొక్కుబడుల  శ్యామదీర్ప మాటబొంది

మూడుపదుల చైత్రంబులు  చూచుచుండ గడచిపోయె
తల్లిమాట శ్యామమరచి  సప్తశృంగి మొక్కువిడచె
బహుయిడుముల శ్యామపొంది   జోతీషుని వివరమడిగె
సప్తశృంగి మరచుటయె  యిక్కట్లకు మూలమెరిగె

వెనువెంటనె శ్యామ , రజిత వక్షముల జేయించి
సప్తశృంగి బాబదలచి, బాబకర్పింప యట
బాబ యంత యూదినిచ్చి   వాణినగరమెడల బలికె
సప్తశృంగి  తానుగొలువ, శ్యామ వైద్యగృహము జేరె
షిరిడి జూడ మిగుల దలచు , వైద్య శ్యామరాక గనియె
సంతసంబు మదిని నిండ , సంగమంబు యటుల గలిగె

కులదేవత నర్చించి , వైద్యతోడ శ్యామ మరలె
వైద్యబాబ పదముబట్టి , పరమశాంతి మదినిపొందె
కనుల కనులు గలిపిజూసి , కనులబాష్పముల నింపె!
సాయిశక్తినచట గనియె , అయస్కాంతమదియె అదియె!

రహతా వాసి  కుశాల్చందు , స్వప్నమాయె పగటిపూట
టాంగతొడ కాకబంపి , షిర్డి లాగె సాయిలీల !
బొంబాయి రామలాలు , సాయిపేరు తెలియనోడు
స్వప్నమందు సాయిజూసి , షిర్డి జేరి నివసించే !  


నాల్గవభాగము  సంపూర్ణము 

శ్రీసాయినాథాయ నమః 
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు! 


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


















Comments

  1. The above post is the 4th of 7 parts of Sri Sai Ganamruthamu!

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!