శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము -2 (మూలము: శ్రీసాయి సచ్చరిత్రము.)

శ్రీగణేశాయనమః,శ్రీసరస్వత్తైనమః,సమర్ధసద్గురు శ్రీసాయినాథాయనమః.

ముందుమాట!
శ్రీసాయిలీలలను  గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ  శ్రీ సాయిలీలలు  గేయ రూపంలో  వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకు వీలు
కానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల  భావసందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా   చరిత్ర పారాయణజేయువారు  శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము  పారాయణ జేసి   ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము  శులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది.  శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు  మనఃస్ఫూర్తిగా  ప్రార్ధిస్తున్నాను. 

రెండవ భాగము (అధ్యాయములు 8-15)

ఎనిమిదవ అధ్యాయము

మానవజన్మయె  సృష్టిలొ మకుటము
తండ్రిని నెరిగె జ్ఞానప్రకాశము
సురులుగూడ అసూయపరులె
మానవజన్మను మదినికోరెదరు

ఆకలి నిదుర భయ, సంభోగము
జీవులెల్లరకు సాధారణము
నిత్యానిత్య వివేక విచక్షణే 
మానవజన్మకు  దైవప్రసాదము

మానవజన్మయె  మరలదొరకునా
దీపముండగనె యిల్లు సర్దవలె 
దేహముండగనె తండ్రినిగనవలె
మరలదొరకునా మానవజన్మము!

మాటల బెల్లపురుచి తెలియదు
తినుటతోడనె అనుభవంబగు
వేదము జదివిన జ్ఞానము కుదరదు
సద్గురుసేవతొ సాధ్యము నెరుగుడు

అణకువలోనె అగ్రేసరులు
అన్నియుండియు లేమినటింతురు
ముష్టినిరాజుగ జేయగలిగినా
ఇంటింటికివెడలి భిక్ష పట్టెదరు

బాయిజబాయిది  తమ్మునిప్రేమది
జన్మలనుండియొ తెలియనిబంధము
పిచ్చివానిగ  యడవుల దిరిగెడి
బాబకుపెట్టక  తానుభుజింపదు

తాత్యా మాల్సా పతులె ధన్యులు
నిదురకుగూడ బాబ సన్నిధే
పశ్చిమదిశగ  తాత్య  తలనిడ
ఉత్తరదిశగ మాల్స  తలనిడు

రహతా షిరిడికి దక్షిణ గ్రామము
ఉత్తరదిశలొ నీమ్ గ్రామము
బాబా వీటిని దాటియెరుగరు
రైలువేళల  లీలగ నేర్తురు!

తొమ్మిదవ అధ్యాయము

అల్లాయే మాలికనుచు సాయిదేవులు
అందరికి మాలికాయె  సాయిదేవులు
తనవారల పిచ్చుకలగ  మార్చు వింతగ
తాడుగట్టి తనచెంతకు నీడ్చు లీలగ

షిరిడిలొ కొనసాగాలన్నా
తమతమ యూరికి వెడలాలన్నా
సాయి యనుమతి తప్పక కావలె
అతిక్రమించిన తప్పవు తిప్పలు

వడివడి  తాత్య బాబను జేరి
సంతకుబోవ యనుమతి యడుగ
వలదని పలికెను బాబా యంతట
వెడలెను తాత్య బండిదొరలగ

సద్గురు భిక్షయె రక్ష సేయును
గృహస్తులకదియె రామరక్షగా
పంచసూనముల కలుగు దోషములు
సాయిభిక్షతొ తొలగు పాపములు

గురునిచేరగ వెడలునప్పుడు
ఫలము పత్రమొ , పుష్పము తోయమొ
భక్తిశ్రద్ధలయర్పించుటె ధన్యము
మరచిన బాబాయడుగుటే  చిత్రము

తార్కడు బాంద్ర నైవేద్యము  మరువ
ఆకలిపొందిరి మాయిలొ సాయి
ప్రేమతొ పెరుగు పచ్చడి పంపగ
వేపుడు ఏది వెంటనె తెమ్మనె

తార్కడు భార్య భోజన వేళ
రొట్టెవిసరగా శునకమువచ్చిన
త్రేపులు పొందిరి మాజిదు బాబ
చరాచరంబుల సాయి వ్యాపకులు

అంతరంగముల పండరి నాథులు


పదవ అధ్యాయము

కళ్యాణమూర్తియె  సాయిబాబ , లోకకళ్యాణ శక్తియె  సాయిబాబ
సాయినామస్మరణే సర్వధర్మాచరణ ! సాయిబాబా స్మరణే సంద్రమందూ నావ!
బాబానిదురకు  దెంగలే తెచ్చెను బల్లను, నాలుగుమూరలె అడ్డము జానెడు
గుడ్డపీలికల పట్టెలగట్టి  దివ్వెలుపెట్టి నిదురించిరి  సాయి

అంతర్ముఖులు,అంతరస్థితులే , పైకిచూడగ చిర్రుబుర్రులే
మాయిని షిరిడిని వీడక తామే లోకమంతటను వ్యవహరింతురు
యోగులు రాజులు సాయిదేవులు , మహరాజులు తామై యలరియుండిన
ఫకీరువేషము పాతవస్త్రము , అల్లమాలికనుచు భిక్షము

అదృష్టులు వారే బాబనెరిగిన  , అదృష్టులు వారే బాబనుచేరిన
అదృష్టులు వారే సేవలుజేసిన , అదృష్టులు వారే సాయినిపొందిన
తల్లిదండ్రుల ఊసుతెలియదు , కులగోత్రంబుల జాడ తెలియదు
బ్రహ్మసమానమె వారిప్రాయము, దైవాంశునికి జగమే గృహము

నాలుగురోజుల రంగస్థలము , అంతరంగముల ఒక్కడె దైవము
అహము తోడనే నేనును నీవును, గోడల గూల్చుటే   గొప్పజ్ఞానము
యోగము త్యాగము  జపమూ ధ్యానము, దైవముజేరుట కెన్నిదారులొ
ఒక్కమార్గమును  చక్కగపట్టుడు , ఘర్షణవీడుడు గురునిచేరుడు

నియతగురువులె సాయిదేవులు, అహమును తొలచి ఆత్మజూపెదరు
అంతరంగముల చదివెడి చోరులు, అందరిలోన అల్లాజూతురు  
షిరిడీవాసులు పూర్వపుఋషులు, సాయితొగడిపిన  ధన్యజీవులు
షిరిడీస్త్రీలది గోపికప్రేమది, పల్లెపాటలలొ ఆత్మయున్నది

యశస్సు ధనము నిరభిమానము, జ్ఞానము మహిమా ఔదార్యంబుల
దైవగుణంబుల  బాబ నిండిరి, భక్తికిబానిస సాయిబల్కిరి
ఇంద్రియంబుల  గెలిచిన రాజులు , రుచులను కామమునెగ్గిన యోధులు
బ్రహ్మచారులు బ్రహ్మతేజులు, రాజాధిరాజ యోగిరాజులు

గద్దెపై మోజు లేదు సాయికి, పీఠము మక్కువ లేదుసాయికి
గద్దెనెక్కి నానావళి గూర్చొన , వల్లెవల్లెయనె భోళశంకరుడు 
మంత్రమునివ్వడు యోగముచెప్పడు, భక్తులకెప్పుడు సాయిదేవుడు
సాయినామమె చక్కటిమంత్రము , సాయిపాదమె స్వర్గతుల్యము

యోగులకథలను  చదువుడు వినుడు, వారితొ సంగమ సత్సంగమమదియె
లోకమోహములు క్రమముగ దొలగును , అంతఃపురద్వారంబులె తెరియును


పదకొండవ అధ్యాయము

సగుణ నిర్గుణ రూపమె బ్రహ్మము , సగుణ బ్రహ్మయె సాయిరూపము
మానుషరూపుతొ సాయిదైవము, మించిన దైవము మనుజులకెవ్వరు
మోహనరూపులు మోహాతీతులు, సాయిదేవులు భక్తుల ప్రియులు
వారిపై భక్తియె స్థిర ఆసనము, కోర్కెల వీడుటే సరిసంకల్పము

నదీనదంబులు తమగమనంబులో , జీవకోటికి ప్రాణప్రదంబులు
యోగుల జన్మలు యోగుల కర్మలు, మానవాళికి మంగళ ప్రదములు
యోగవరిష్ఠులు సాయిదేవులు, కంపనమెరుగని  కాంతిపుంజులు
చందనచర్చలు పాదపూజలుభక్తులప్రెమలొ బాబవినమ్రులు

డాక్టరుపండిటు అమాయక భక్తుడు, బాబనుదిటిపై త్రిపుండ్రము నద్దెను
భక్తుల ప్రేమకు బాబదాసులె , పండిటు బాబలొ తనగురునిజూసెలె
తల్లులు బిడ్డల తరిమి గొట్టునా? సంద్రము నదుల వెడల బల్కునా ?
చిర్రుబుర్రులు సాయిజూపినా , శ్రేయముజేసెడి సాయిభావమది

సద్గురుకృపను తానుపొందగ , సాయిదేవుల ఫాల్కె జేరెను
ఉపేక్షించిరి తొమ్మిదినెలలు, కటాక్షించిరి యాత్ర అహము తొలగ
సాయిశక్తికి తలవంచెనులే , తమశక్తిజాలని పంచభూతములు
హుంకరించుచు తుఫానునాపిరి , దిగుదిగుయనుచు ధునిమంటల దింపిరి

శరణాగతియది మనకు సద్గతి , లీలలశ్రవణమె మనకు ధ్యానము
బాబ కథలలొ సూక్ష్మమున్నది , సరిమదినిలుపుటే మోక్షమన్నది
సాయికావ్యము మధురపాయసము,భక్తులకథల రుచులపాయసము
చిత్తశాంతమిడు చిత్రపాయసము, రెండుచేతుల జూరితరింపుడు!

పండ్రెడవ  అధ్యాయము


తల్లిప్రేమ సాయిది , తండ్రిశ్రద్ధ  సాయిది
తనదుపుణ్య  ఆస్థిపంచి  తనబిడ్డల మేలుగూర్చు
తనవారలయన్నవారె  సాయిపిలుపు పొందెదరు
తనదుపిలుపు లేకుంటె  దాపునున్న జేరలేరు

షిరిడి వదలి వెడలుటకు బాబయాన కావలె
మరోరోజు ఉండుటకు సాయియాన కావలె
తమ ఇష్టము వెడలుట కష్టములతొ చెలిమియె
బాబ శెలవు పొందుట బహుచల్లని శకునమే

ఉండదలచు కాకాను మరుదినమే పొమ్మనె
వెళ్లదలచు ధూమ్రాలును వారముండమని బలికె
జబ్బుపడ్డ బిడ్డజూడ  బెలాపూరు వెళ్లదలచు
నిమోన్కరు భార్యకు నాల్గుదినము లనుమతిచ్చె

సాముద్రిక మూలె శాస్త్రి 
బాబచేయి జదువ తలువ
అరటిపండ్ల నందించి
తమహస్తము చూపకుండె

మహమదీయుడని తలచి
పూలువిసరె మూలె యచట
సాయిలోన గురుని జూసి
విస్మయమదె  ప్రణమిల్లె

సర్వదైవరూపు సాయి
రాముడతడు రహీమతడు
బాబాముస్లిమను దలచు
డాక్టరుకు రాముడాయె

గురువు నందు గురినిలుపగ
ఆగురువే అన్నిరూపు
గురునందు గురిదప్పుటే
పరికింపగ తుదిమొదలు!

పదమూడవ అధ్యాయము


బాబా మాటలు బహుక్లుప్తములు
భావగర్భితములు అర్ధ పూర్ణములు
శక్తివంతములు సమతూకములు
తృప్తిపరులు, నిచ్చింతులు బాబ

మాయప్రభావము మిగుల ప్రలోభము
బ్రహ్మనైన వలవేసెడి మోహము

" ఫకీరునైన బాధించును నన్ను
  దైవాశ్రయమె దానికి వైద్యము
  తనరూపులె యోగులు శ్రీకృష్ణ పలుకులు
  అదృష్టము కల్గినె ననుసేవింతురు
  సంద్రములేడును సాయన చెల్లును

  విశ్వసింపుము  మేలుపొందుము
  పూజలతంతుల ఆశింపను నేను
  షోడశసేవల కోరను నేను
  అష్టాంగయోగముల కష్టము వలదు
  భక్తియె మేలుబాబ పలికిరి

శరణాగతి కోరగ సర్వము మోతురు
భారము రోగము తీర్తురు వేగము
భీమాజిపాటిలు క్షయముక్తుండై
సాయిసత్యవ్రతముల మొదలిడె షిరిడిలొ

బాలగణపతి జ్వరపీడితుడు
కుక్కకన్నమిడి రోగముక్తుడే
బూటివాంతులు  వాక్కుచె శాంతము
ఆనందస్వామి కర్ణ శూలమె దూరము

దత్తోపంతు కడుపునొప్పితొ కాలిడ
ఊది ,వచనముల బాబ కూర్చిరి
మూలవ్యాధిచె శ్యామ బాధపడ
కషాయంబుల బాగుజేసిరి

బాబ వచనా   బలమటువంటిది
మందులమించిన  మాటల బలమది
వ్యాధులు బాబ మాటల దూరమె
బాధలు బాబ పలుకుల చూర్ణమె!


పదునాల్గవ అధ్యాయము


మధురం మధురం అతి మధురం
సాయివచనమే అతిమధురం
మధురం మధురం అతిమధురం
బాబ వదనమే బహుమధురం

సాయినామము నిత్యము నిలుపుడు
సాయిలీలల నిత్యము  వినుడు
సాయిభావముతొ  నిత్యము నిండుడు
సాయిసాధనతొ  శాంతము పొందుడు

నాందేడువాసి రతనవాడియ
అతిధనవంతుడు అతిగుణవంతుడు
అన్నియున్నను లోపమొక్కటే
సంతానములేక అతిదుఃఖితుడు

బాబాకృపచే బాబను చూసెను
పూవులమాలను గళమున వేసెను
బహుఫలముల బాబకర్పించి
తనదుబాధను విన్నవించెను

దయాళుబాబ హృదయముకరిగెను
ఐదురూకల దక్షిణ నడిగి
ఒక్కరూక రెండణాలుపొంది
మిగిలిన రొక్క మందెనని పలికెను

బాబఆసిస్సు  రతనకు కలిగెను
సాయి మౌలవీల ఏకత్వము నెరిగెను
సాయిదీవెనల సంతు పొందెను
సంతసించె బహుసంతసించెను

దక్షిణ నిచ్చుట వ్రతఫల పూర్ణము
దక్షణలందుట  మనరక్షణకొరకె
ఒక్కరూకకు వందనిత్తురు
పైసపైసకు లెక్క జూపెదరు

బాబాయటుల దక్షిణలంది
బహుముఖముల భక్తులగాచిరి
కోరనివారిని అడుగడు తాను
కోరినవారిని విడువడునేడు! 


పదునైదవ అధ్యాయము

హరిదాసుండు హరిహరి యనవలె
ధోవతియొకటి ధరించిన చాలులె
మాలగళమున  చిరుతలు చేతిలొ
తానుధరించి హరి స్మరింపవలె!

భక్తసూరదాసులే , భక్తరామదాసులే
భక్త తుకారాములే , సాయిభక్త దాసగణు
సాయిలీల గానముతొ నలుదిశల వెడలెనులే
సాయిప్రేమ పాశమును పదుగురికి వేసెనులే


ఊరువూరు వాడవాడ సాయిభక్తి పెరిగెనులే
గూడు గూడు ఎదయెదలో సాయిదివ్వె వెలిగెనులే
భక్తులెల్ల తన్మయులై సాయిలీలతేలియాడ
సాయిదేవ మదినిలువ వారియెదలె  గుడులాయె

ఎదిగియెదిగి షిరిడి బహుమహిమల తీర్థమాయె
దూరతీర భక్తులకు పావన పరమార్థమాయె
అంతట యొకదినంబున
సాయీశునిగానమును పరవశమున జేయుచుండె

దాసగణు థానలోని ఈశుని దేవళమున
భక్తబృంద మద్యంబున చోల్కర్ గూర్చుండెలె
ఇలలోన కుచేలుడు తనువుమరచె తన్మయమున
జీతమేమొ అల్పము  కోర్టు కొలువు దినదినము

పరివారము బహుళము ఎపుడూడునొ యుద్యోగము
సాయిసుధా గానమును తనివితీర గ్రోలెలె
ప్రణమిల్లెను మనసులోన  బాససేసె తక్షణమున

" దీనుడ యతిపేదను పరివారము మోపలేను
  మీదయా  పరీక్షనెగ్గి కొలువు పదిలమైనచొ
  షిరిడివెడలి మీగుడిలొ బాబ మిమ్ముగొలిచెద
  భక్తిమీర మీపేర కలకండను  పంచెద "

సాయికరుణించెలె పదవి పదిలమాయెలె
షిరిడివెడల చోల్కరుకు బహుళజటిల మాయెలె
సహ్యాద్రి లంఘనమె  అవలీలము యవలీలము
నిరుపేద దాటుటెటుల  సంసారసాగరము

గృహవెచ్చము తగ్గించె షిరిడిఖర్చు నిమిత్తము
చెక్కెరనె  మానివేసి సేవించెను తేనీటిని
పొదుపైనపైసలతొ సాయిచూడ వెడలెను
ద్వారకామాయిలోన సాయిని దర్శించెను

గురునిసేవించెను గురునిపూజించెను
గురునిపేర ప్రేమమీర  కలకండను పంచెను
గురుదేవుల సన్నిధిలొ హృదయము శాంతించెను
గురుదేవుల పెన్నిధితొ పరమార్థము పొందెను

గురుదేవులు సంతసించి జోగును వెనువెంట పిలచె
చోల్కరుకు చక్కెరతొ    మిగుల మిగుల చక్కెరతొ
తేనీటికప్పులివ్వ మధురముగ బలికెను
చోల్కరుడు చకితుడాయె తడికన్నుల గురునిమొక్కె

చోల్కరుని మనసేమో గురుసాయికి విదితము
చక్కెర కలకండతొ చోల్కరుని కరుణించెను
భక్తిశ్రద్ధ సేవించెడి భక్తులె ఇల ధన్యులు
సర్వాత్మగ సాయినెరిగి శక్తిముక్తి పొందెదరు

మజీదుగోడపై బల్లియొకటి టికుటికు యన
చెల్లిరాకకే యతి సంబరమని సాయిబలికె
అగంతకుడొకడు వచ్చి ఉలవమూట  విప్పగ
బల్లియొకటి చెల్లిజేరి అచ్చెరువుగ యాడెను.


రెండవభాగము సంపూర్ణము 

శ్రీసాయినాథాయ నమః 
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు! 


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!



Comments

  1. The above post is 2nd part of Sri Sai Satcharitra samshipta Ganamrutamu (total 7 parts).

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!