శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము -3 (మూలము: శ్రీసాయి సచ్చరిత్రము.)

శ్రీగణేశాయనమః,శ్రీసరస్వత్తైనమః,సమర్ధసద్గురు శ్రీసాయినాథాయనమః.




ముందుమాట!

శ్రీసాయిలీలలను  గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ  శ్రీ సాయిలీలలు  గేయ రూపంలో  వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకువీలుకానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల  భావసందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా   చరిత్ర పారాయణజేయువారు  శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము  పారాయణ జేసి   ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము  సులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది.  శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు  మనఃస్ఫూర్తిగా  ప్రార్ధిస్తున్నాను. 

మూడవ భాగము (అధ్యాయములు 16-22)

పదునారు,పదునేడవ అధ్యాయములు

చిరుఅటుకుల కరుణించెను కుచేలుని కృష్ణుడు
భక్తియున్న జలము  చాలు వేలువలదు బాబచూడ
చింతామణి కామధేను బహుమించును సాయిదేవు
కోరినవే అవియిచ్చును, కోరకనే సాయిగూర్చు

ధనికుడొకడు పిసినారి  బ్రహ్మజ్ఞానమెరుగ గోరి
బాబచెంత ప్రణమిల్లె  జ్ఞానమంత నివ్వబలికె
బాబయతని యూహనెరిగి బహు సెహబాసు బలికె
బ్రహ్మజ్ఞానమడుగువారు బహుఅరుదు బాబపలికె

బాలునొకని పిలిపించి పలుచోటుల బాబపంపె  
అప్పు ఐదురూకలకు;  వట్టిచేతుల బాలుడొచ్చె 
పిసినారి ధనికుండు చూసికూడ మిన్నకుండె
బహుపైకము జేబునుండ, పైసకూడ తీయడాయె
సహనమంత కోల్పోయి యతితొందర చేయసాగె

" మిత్రమా యోపికింత, జ్ఞానమిదియె " బాబ పలికె
" బ్రహ్మజ్ఞానమొందుటకు ఐదు కాన్కలివ్వవలె,
  పంచప్రాణ,పంచేంద్రియ ,మనసు,బుద్ధి ,అహములవి
  బహుయోగ్యత యుండవలె, బ్రహ్మజ్ఞానమొందుటకు
  ముముక్షుత,విరక్తి,అంతర్ముఖ  అవశ్యమె

  పాపమోచనొందవలె , రుజువర్తన నడువవలె
  ప్రియంబుల మిగుల వదలి , శ్రేయంబుల కోరవలె
  పంచేంద్రియ తురగముల స్వాధీనము నుంచవలె
  పావనమనంబుతోడ పదుగురితొ మెలుగవలె
  గురుదీవెన చిరుదీపము, ఆత్మరూపు జూడగోర
  ఇన్నియున్న చాలవన్న , దైవానుగ్రహమె మిన్న"

జ్ఞానవాక్కులటుల బలికి, మణిరత్నములటుల పంచి
ఏబదివంతుల బ్రహ్మ జేబునాతనుండ బలికె .
సరిగనంత సోమ్ముజూసి , ధనికుడెంతొ విస్తుబోయె!
బాబా పాదంబులంటి , ఆసిసులు పొందగోర
బాబ పలికె  బహునేర్పుగ, 

" నీబ్రహ్మపు డబ్బుసంచినీజేబున  యుండనిమ్ము 
  లోభమోహమాయ తెరల జ్ఞానదీప  మేల నిలుచు?
  ఇహమునందు అహమునిలువ, పరంజ్యోతి ఎటుల వెలుగు?
  అభిమానమె యతిశయింప , ఆ... జ్ఞానమె యెటుల కలుగు?

  కోరికల సుడులలొ వడివడిగా తిరుగువాడు,
  ఫలాపేక్ష ఉచ్చులలొ కుశలకర్మ మరచువాడు,

  అహంకార కూపమందు విహారములు జేయువాడు,
  గురుకటాక్షంబును పొందలేడులే!
  బ్రహ్మతేజంబును గాంచలేడులే!

 ఎవరు దేని కర్హులో, దానివారు పొందెదరు  
 ఖజానా నాది జూడ, బహునిండుగ యున్నది
 యోగ్యతను పరీక్షించి, బహుమతి నేనిత్తును
 ద్వారకామాయిలో, సత్యము నే పలికెదను."
ధనవంతుని తోటివారు బాబ బోధ విందుసేసె
బ్రహ్మజ్ఞాన విధినెరిగె , పరబ్రహ్మ విలువెరిగె!

పదునెనిమిది,పందొమ్మిది అధ్యాయములు

సాయిబోధలు   తేనెల సోనలు
బహుశ్రేయంబులు  జ్ఞానదీపములు
ఆత్మతేజమును జూపెడి దారులు
ఆనందాంబుధి  తేల్చెడి లీలలు

హేమాద్రిపంత్ గురుకృప పొందుట
ఆంగ్లేయులపాలనము, సాఠె రోజులందు
కొద్దిగొప్ప పేరుపొందె , ఆస్తియెల్లతరిగిపోవ
చిత్తశాంతి లుప్తమాయె. సాఠె పుణ్యఫలమదేమొ

సాయిజూడ మనసుగలిగె , షిరిడిజేరి గురునిచూసె
ఆత్మతేజ రూపుజూడ మనమదేమొ శాంతమాయె
సాయిదేవు మదినిలిపి " గురుచరితపఠనజేసె
సప్తాహము యటుల గడువ, సాయిదేవ స్వప్నమాయె  

గురుచరితము గురువునిడి  ఉపదేశము జేయునటుల
సాఠె మిగుల తృప్తిపొంది , కాకాసాహెబు దీక్షితుజేరి 
బాబయేమి చెప్పదలచె , స్వప్నసందేశమేమి?
వివరణ తా నెరుగ బలికె !

తగుసమయంబుజూసి  దీక్షితు గురునిగలసె   
స్వప్నమటుల యెటుల గలిగె , మూలార్థము తెలుపబలికె
" మరోసప్తాహము గురుచరితము పఠన సేయ
  మిగుల మిగుల శ్రేయమగును " సాయిదేవు బదులు పలికె

బాబచెంత సాఠె కథను , హేమాది పంతు   వినియె
" నలుబది వర్షంబుల గురుచరితము పఠించితి
  సప్తవర్షంబుల సాయిదేవ యర్చించితి
  కృషియంతయు నిష్ఫలమా? నిరీక్షణమె శేషమా?
  ఏడుదినంబులె చూడ, సాఠె సాయికృపను పొందె? "

పంతు మదిని కలతనొందెతలచి తలచి చింతనొందె !
నాడి నెరుగు వైద్యుడేమొ , బాబ యాతనూహ నెరిగె
మధురంబుగ నిటుల బలికె, చెంతనున్న పంతు తోడ.
" శ్యామయింటికిపుడె పొమ్ము, పదునైదు రూకల తెమ్ము,
  కుశలమడిగి తిరిగిరమ్ము,పొమ్ముపొమ్ము ఇపుడె పొమ్ము."

పంతు శ్యామ గృహము జేరె , బాబ హుకుము  జారీచేయ
చింత విడచి విశ్రమింప, సాంత్వనముగ శ్యామ బలికె
నిత్య నాథభాగవత , శేష పఠన మాయింట
పంతు పూరించె నంత , శ్యామపూజ ముగియునంత

పంతు తనదు రాక దెలిపి , దక్షిణివ్వ  శ్యామనడుగ
అంత దక్షిణివ్వలేక, పదునైదు ప్రణతులిచ్చె !
హేమాద్రిపంతు సంతసించి  మిత్రునితొ ముచ్చటించె
సాయిలీలలెన్నొ గలవు, ఒక్కలీల తెలుప బలికె.

అంతట శ్యామ
" కొల్లలు కోకొల్లలు  సాయిలీలలెన్నతరమ
  పామరుడా నా చెంతకు, పండితుని నినుబంపె
  దైవలీలలెల్ల బలుక , వేయినాల్కలిచట కురుచ
  స్వానుభవమిదియె వినుము, వినుము వినుము  మనము యలర
  ఆర్తులా స్ఫూర్తిదాత, సాయిదేవ సాయిదేవ
  తన లీలల పరీక్షించి భక్తులకుపదేశమిడును. "

ఉపదేశము పదము వినియె, ఉపశమనము పంతుపొందె
తనకు చిత్తశాంతమివ్వ బాబ యటుల బంపె దలచె.

పిమ్మట శ్యామా తన కథనిటుల దెలిపె ,
" వృద్ధురాలు భక్తురాలు, రాధాబాయి పుణ్యురాలు
  బాబానచట సేవించిన మహా మహా భాగ్యురాలు
  షిరిడి నాథు గురునితలచి , ఉపదేశము పొందగోరె
  మంత్రమేదిపొందు వరకు తనబసలో ఉపవసించె

  మూడుదినములటుల గడచె , అన్నపాన మామెవిడచె
  పరుగు పరుగు బాబజేరి , యామెదీక్ష వివరించితి
  భక్తురాలి కాపాడని యాపేక్షణ మనకు మిగులు
  మంత్రమేది యామెకొసగి శిష్యురాలు జేయిదేవ "

అంతట బాబ ఆమెను పిలిపించి యిట్లనియె ,
" అమ్మ అమ్మ యేలనీవు దుర్మరణమునిచట గోరు
  నీకు నేను పుత్రుండను , కాసింతను దయనుజూపు
  ఇదిగొ యిదిగొ నాకథను ఇపుడె నీకువినిపించెద
  అటులపలికి సాయిదేవ గతము బలికే శుభము సేయ

  అతికృపాళు , పరమహంస , పరమాత్మయె నాదుగురువు
  మంత్రమేది పొందగోరి , బహుదినముల సేవించితి
  గురునితలపు మరోవిధము, దైవలీల వినుము వినుము
  క్షురకర్మ జేయించి రెండుపైస దక్షిణడగె

  శ్రద్ధా సహనాల , రెండుపైస లర్పింప 
  ఎంతొ యెంతొ సంతసించె , గురుదేవులు పొందినంత
  అన్నవస్త్రమెల్ల మరువ, యేండ్లుగడచె గురునిసేవ
  ప్రేమమయుడు ప్రియము మీర, పెంచినన్ను పెద్దజేసె

  ఆకలీ దప్పులేల , గురునిపైనె నాచూపు
  సామాధి స్థితి గలుగ , గురువు యటుల దీవింప
  పరమశాంతి యచట యచట ఇరువురి యదలనిండె
  రాత్రిపగలు యటులదొరలె , గురునిసేవ మిగుల మిగుల

  గురునిమించి ధ్యేయమేది? గురునిమించి భాగ్యమేది?
  గురునిరూపు దూరమైన అంతరంగ కల్లోలమె!
  నాసర్వము గురుసేవకు అంకితము, యంకితము
  శ్రద్ధ ఇదియె నేనొసగిన మొదటిపైస దక్షిణ

  సహనమదియె రెండవది గురువడిగిన గురుదక్షిణ
  కాలమంత మరచితిని , బహుకాలము గురునిసేవ
  సహనమదియె దాటించు, భవసాగర పోకడల
  సహనదియె దాటించు, జీవితపు ఒడిదుడుకుల
  శ్రద్ధ సహన మటుల యలర , గురుదేవుల సేవించితి.

  అన్యదక్షిణాసలేక, గురువు రక్షించె నన్ను
  దగ్గిరేని దూరమేని , కరుణతో వీక్షించెనన్ను
  కూర్మమటుల తనబిడ్డల, దృక్కులతొ పెంచునటుల
  మంత్రమేది నాగురువులు, చెవిలోన ఊదరమ్మ!
  ఏవిధముగ నీకు నేను ఉపదేశము నిత్తునమ్మ ?

  నమ్మునమ్ము నాపలుకులు,మజీదులోనుంటినమ్మ,
  నమ్మునమ్ము ఏమంత్రము , నిన్ను యుద్ధరింపదమ్మ!
  నీఊహల నీచేతల, నాపైనే గురిని నిలుపుము ,
  చదువులెల్లవ్యర్ధమమ్మ , పరమాత్మను నీకు జూప!
  భక్తికనుల ననుజూసిన, ముక్తిపథము నే జూపెద,
  హరిహరాది రూపులమ్మ గురుదేవుల లీలలెరుగ ! "

అంత వృద్ధమాత నిజముగ్రహించి బాబకుప్రణమిల్లి దీక్ష విరమించె !

వృత్తాంతమునెల్ల విని, పంతు మిగుల చకితుడాయె
మనసుపొంగె గళము పూడె, దేహమెల్ల పులకింప
పలుకులేదు ఉలుకులేదు, బాబలీల తానువినగ 
సాయిలీలలెన్నతరమె ! శాంతిపొందె పంతు యచట

అంతలోనే,
మజీదున గంటమ్రోగె , ఆరతి సరి సమయమాయె
శ్యామ హేమాద్రులు  , పరుగు పరుగు గురునిజేరె
జోగు సాయిపూజసాగె,స్త్రీపురుషుల గానముతొ
కంజరా మృదంగ ధ్వనుల , ఆరతందె సాయిదేవ
హేమాద్రిపంతు ముందునిలువ, శ్యామ బాబచెంత నిలచె
పదునైదు ప్రణతులా, శ్యామనిచ్చె దక్షిణగా!

ఇరువురి సంభాషణల వివరణ గురుదేవులు పంతునడుగ ,
ఆరతి సంబరమున పంతు  నిటుల జెప్పదొడగె.
" అతిమధుర మాసంభాషణ, దేవనీదు లీలకాదె 
  వృద్ధురాలి కథ నెపముజేసి, కృపనుజూప.
  దేవ నీదు ఉపదేశపు మూలార్థము తెలిసెనులే
  మదియలజడి తొలగెనులే,చిత్తశాంతికలిగెనులే
  పరమార్థము తెలిసికొంటి, నీదులీల గరిమకంటి . "

అంతట బాబా ఇటుల బలికె ,
" నామార్గము ప్రత్యేకము , కథయె నీకు సందేశము
  సాకారా నిరాకార, నాదురూపు ధ్యానించు,    
  ధ్యాత ధ్యాన ధ్యేయంబులె  ఏకమవ్వ నన్ను జూతు
  నీదునాదు సంబంధము , కూర్మ శిశు  న్యాయమే! "
మధురవాక్కులటుల బలుక , గురుని యారతచట  ముగిసె
పంతు మిగుల ధన్యుడాయె , బాబకృపకు పాత్రుడాయె!

బాబా సూక్తులు
కలయిక రుణబంధమేర , బంధబలమె గలుపు మనల
 అగంతకుల ఆదరింపు, దయతోడను ప్రేమజూపు 
 దప్పిగొన్న జలమునిమ్ము , ఆకలన్న అన్నమిడుము
 దిగంబరుల వస్త్రమిమ్ము  , దైవకృపకు పాత్రుడగమ్ము

  చేరువారల  తరిమికొట్టకు , సాయమివ్వనిచొ ప్రేమబల్కుము
  మనసులమధ్య గోడ గూల్చుము, ఎల్లలులేని సాయిని జూడుము
  సుకర న్యాయమే పరులదూషణ , దోషమెంచుటే పాప శేషము
  హీన  కర్మము , పుణ్యహరణము!   

  బాబాచూపెడి దారులనేకము, కొందరికేమొ  సాయి స్మరణలు
  కొందరికేమొ  ఆత్మవిచారణ , కొందరికేమొ  లీల పఠనము
  కొందరికేమొ నామజపములు , మరికొందరికి గ్రంథ పారణలు
  కొందరికేమొ పాదసేవలు , మరికొందరికి స్వప్నబోధలు

  పరుల కష్టము యూరక పొందకు, పెక్కురెట్టుల ప్రతిఫలమిమ్ము
  అందరిలోన సాయిజూడుము , సద్గురుకృపకు పాత్రుడగమ్ము!


ఇరువదవ అధ్యాయము

నిరాకారులె  సాయిదేవులు, మాయనాటకమున దేహధారులు
ద్వంద్వాతీతులు బంధరహితులు, ద్వారకమాయిలొ మురళీధరులు
భక్తులపైన బాబాప్రేమది, మాతృప్రేమనె మరపించునది
అమ్మని అన్నని, ఆప్యాయత బిలుతురు
ఊది ప్రసాదముల  స్వయముగ నిత్తురు

ఈశోపనిషత్తు:
బాబాదాసుడు దాసగనుండు, ఈశోపనిషదు భాష్యము వ్రాసెను
భాష్యమువ్రాసిన భావముకుదరక , బాబాచెంతకు తానరుదెంచెను
సాయిచరణముల శ్రద్ధతొ మొక్కెనుతనకష్టంబును  విన్నవించెను
బాబాదయతొ  దీవెనలిచ్చెను , దీక్షితు సేవిక తెలుపగ బలికెను
అదియెటులగునని అందరు తలచిరి, బాబక్రీడగ ముదముతొ జూసిరి
కాని,
బాబావాక్కే బ్రహ్మవాక్కని , గణుడు నమ్మెను స్థిరముగ మనమున
దీక్షితు గృహము గణుడు జేరెను, బాబాపలుకుల గణన జేయుచు,
మరుదినంబున పూజవేళలొ, మధురగేయము ప్రియముగ వినెను
సేవికబాలిక ఉల్లాసం బుగ , మృదుమధురంబుగ  పాడసాగెను

" ఎర్రచీరకు ఎన్నిహంగులొ , చీర అంచుకు ఎన్నిరంగులొ! "
మలినపు చిరుగుల మేనిపై నిలిపి , పాత్రలశుభ్రము చేయుబాలికను
దాసగణుడు ప్రియముగ గాంచెను, బాలికతీరుకు బహు జాలిచెందెను
ప్రధానుచేతితొ చీరపొందెను , బాలికకెంతో ప్రియముగ నిచ్చెను

సేవిక ఎంతో సంబరపడెను, మరుదినంబున చీరతొ వచ్చెను
ఎల్లలు దాటిన ఉత్సాహంబుతొ, ఆటల పాటల అందర గెలచెను
తదుపరిదినమున మునుపటి చిరుగుతొ , ఆసంబరమునె మరలజూపెను
" అందరియెడ ఆత్మీయత జూపుచు, డెందమందు ఆనందము నింపుచు
  కలిమిలేములా వెలుగు దివ్వెగా! "  ఈశకు భాష్యము సేవిక జెప్పెను.

దాసగనుండు వివరణ నెరిగెను, దీక్షితు గృహమున తృప్తిపొందెను 
బాబ లీలను తాను గ్రహించిసద్గురు కృపకు పాత్రుడాయెను.
జగమంతయు పూర్ణబ్రహ్మము, హస్తిమశకముల నిండిన ధర్మము!
జగన్నాటకపు  పాత్రలు మనమే, దైవదత్తముల పొందుట సుఖము!
మనశ్రేయంబును దైవమెరుగును, మంచి చెడ్డలను తానె జూచును
పాత్రల మనల  సరినటింపవలె, పరమసంతసము మదిని నింపవలె!  

ఇరువది యొకటవ అధ్యాయము

సాధు దర్శనమె పాపనాశనము , ఆందుకు కావలె పూర్వ సుకృతము
యోగీశ్వరులు దేవదూతలు, పరస్పరముగ వ్యవహరింతురు
ఠాకూర్ యొకరు పుణ్యఫలంబున , అప్పయోగిని వాడగాంన కలసెను 
విచారసాగర బోధను వినెను, అప్పయోగి ఆసిసు లందెను

" విచారసాగర పఠనము సేయుము, కోర్కెలెల్ల పూర్ణములగును
  ఉత్తరదిశ గొప్ప యోగిజూతువు , అదృష్టంబది " అప్పబలికెను
ఠాకూర్ బదిలీ జున్నూరు కాయెను , నాన్హెఘాట్  పయనమతి  కఠినమాయెను
కళ్యాణుకు   ఆపై తానుమారెను, నానాసాహెబు మైత్రిపొందెను
బాబ ఘనతను నానతొ వినెను, షిరిడి పురము తాను జేరెను

బాబ పదంబుల తా ప్రణంబిడి , అతిప్రసన్నత యనుభవించెను
" అప్పమాటలు బహుళ సత్యములు,విచారపఠనము గమ్యము జేర్చదు
  ఆచరింపవలె అనుభవింపవలె , గురుని దీవెనల గురినిజేరవలె
  ఇచటిమార్గము సరళము గాదు , నానాఘాటు పయనము గాదు
  బహు శ్రమింపవలె , గమ్యము జేరగ " సర్వజ్ఞులె, సాయి బలికిరి

పఠంకర్ యొకడు  విద్యావంతుడు, వేదపురాణములెల్ల జదివినా
శాంత చిత్తము తాను పొందక , బాబ పదంబుల తా ప్రణమిల్లెను
బాబా వణిజుని కథ వివరించిరి  , యాతని కెంతో తృప్తి కలుగగ

" ఆతని గుర్రము లద్దెవేయగ , తొమ్మిదియుండల భూమిపై బడెను
  ఉండల బట్టి మూటగ గట్టి, చిత్తశాంతిని సత్వరమందెను."
భగవత్కృపయే ఆడు గుర్రము , తొమ్మిది యుండలె నవవిధ భక్తులు
శ్రవణ కీర్తన స్మరణ సేవన, అర్చన  దాస్య  సఖ్య , ఆత్మార్పణ, నమములు

"ముందుముచ్చటలు, వెనుక తప్పటులు" , పండరి వకీలుతొ సాయి బల్కిరి
నూల్కరు షిరిడీ  వెడలు సమయమున , లాయరు వారిని  గేలి జేసెను.

ఇరువదిరెండవ అధ్యాయము

భక్తుల భారము బాబా మోతురు,బాబా భారము తమ పాదములె  నిలుపును
గురుపాదంబుల  మనమున నిలుపరె!గురుపాదములనె శిరమున దాల్చరె !
బాబా పాదాంగుష్ఠము చంద్రలేఖయె , ఆతురనింపుచు దృష్ఠి నిలుపరే !
శీతలపాదము శిరముతాకితే , తాపములన్నియు తొలగు త్వరితమె !

ఒక్కసమయమున మౌనిరూపులు,ఒక్కసమయమున చైతన్య దీప్తులు,
ఒక్కసమయమున కోపోద్ధీతులు, ఒక్కసమయమున శాంతమూర్తులు. 
ద్వారకమాయి ఒడిని చేరగ , సర్వదోషములు దూరమౌనులే!
సర్పవిషములు , వృచ్చిక బాధలు బాబ చెంతనే పారిపోవులే!

బాలాసాహెబు రక్షణపొందెను , చితలీలోని హనుమ మందిరమున
జోతిషు మాటలు ఏల చెల్లును? బాబా పలుకులె బూటికి  కవచము
అమీర్ శక్కర్ బాబా భక్తుడు, కీళ్ళవాతముతొ  మిగుల బాధితుడు
చావడిలోనె బాబతొ శయనము , సాయిరక్షణచె సర్పము హతము

పురాణపఠన పుణ్యసమయమున, పంతు భుజమున తేలు బాకెను
బాబయుండగ భయము ఏలను? తేలుగూడ బహు శాంతమాయెను
దీక్షితువాడ కిటికినందున, సర్పము జేరగ సర్వులు క్షేమము.
శివునాజ్ఞలేక చీమేల  కుట్టునుశివునాజ్ఞలేక పామేల బుసలిడు?
సాయిరక్షణే  చూడ రామరక్షణముభక్తకోటికి మిగుల శ్రేయ కవచము!


 మూడవభాగము  సంపూర్ణము 

శ్రీసాయినాథాయ నమః 
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు! 


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!




Comments

  1. Today"s post is 3rd of 7 parts of Sri Sai Ganamruthamu.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!