శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము -5 (మూలము: శ్రీసాయి సచ్చరిత్రము.)

శ్రీగణేశాయనమః,శ్రీసరస్వత్తైనమః,సమర్ధసద్గురు శ్రీసాయినాథాయనమః.


ముందుమాట!

శ్రీసాయిలీలలను  గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ  శ్రీ సాయిలీలలు  గేయ రూపంలో  వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకువీలుకానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల  భావసందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా   చరిత్ర పారాయణజేయువారు  శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము  పారాయణ జేసి   ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము  సులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది.  శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు  మనఃస్ఫూర్తిగా  ప్రార్ధిస్తున్నాను. 

ఐదవభాగము (అధ్యాయములు 31-37)

ముప్పది యొకటవ అధ్యాయము

బహుదూరపు బాటసారికి
మజిలీయె , ఈజన్మము
నారాయణ నామంబుతొ మజిలీ వీడ
పుణ్యగతులంటున్నది సృతి వాక్యము.

క్షణము క్షణము అనుక్షణము
దైవ స్మరణ చేయుడు
జాగృతిలొ నిదురలొ దైవస్మరణ వీడకుడు 
మరణవేళ మంచిజన్మ కదేబాట చూడుడు !

విజయానంద్ సన్యాసి, మదరాసు నివాసి
మానససరోవర యాత్రకై వెడల దలచి
సాయిచెంత నిలిచిపోయె
షిరిడిలోన పరమునెరిగె!

" కాషాయంబుతొ కోర్కెల కట్టుడు 
  చిత్తవృత్తులా జిక్కిన చిక్కులె
  చీకటివేళల జాగ్రత జాగ్రత
  సొత్తునెత్తెదరు చోరులు, జాగ్రత
  హరిచరణంబులె  రక్షణ,రక్షణ ."

సాయిదేవ సన్యాసికి  శ్రేయసందేశమిడిరి
భాగవత సప్తాహము సన్యాసి శ్రధ్ధజేసి
రామవిజయ  పఠనము మృత్యుదేవ  ప్రియము జదివి
సాయిదేవ సన్నిధిలొ స్వర్గారోహణజేసె!

బాలారాం  మాన్కర్
తాత్యసాబ్ నూల్కర్
భక్త మేఘశ్యాముడు
సాయిదేవ కెంతొ ప్రియులు

వారియంత్యకాలంబున
బాబవద్ద వసియించిరి,
సాయిదేవ సన్నిధిలొ
కైవల్యము పొందిరి.

పుణ్యజీవి పులియొకటి
పూర్వపుణ్య మెంతొగాని
బాబచెంత తనువువిడచి
పరమగతిని తానె పొందె!

ముప్పది రెండవ అధ్యాయము

సంసారరూపమె తలక్రిందులు వృక్షము
వేళ్ళు సాగె నింగికి,కొమ్మరెమ్మ కిందికి
గుణములచె పోషకములు, ఇంద్రియవిషయంబులచె యంకురములు
వేళ్ళుసర్వవ్యాపకములు , కర్మబంధకారకములు

వైరాగ్యమె వాడికత్తి  బలమైన చెట్టు నరుక
మార్గదర్శి వెంట నడువ మనగమ్యమె సులభము
బాబ తమమిత్రులతొ బ్రహ్మమును తర్కించెను

ఆత్మచే ఆత్మనుద్ధరింప, మొదటివ్యక్తి బలికెను
భావముక్తి యదేముక్తి, రెండవ మిత్రుడు బలికె
సత్యాసత్య విచక్షణే జన్మరాహిత్యము, తృతీయ మిత్రుడు బలికె
"పుస్తకజ్ఞానముకందని భావముబ్రహ్మము,బ్రహ్మము
 తనసరికర్మల నిత్యము జేయుచు, సద్గురుసేవలొ తా తరింపవలె"
తనదు వాక్యముగ , బాబ పలికెను

జగమంతయు అరణ్యము,దట్టమైన యరణ్యము
వెలుగుచొరని కాననము, దైవరీతి యగోచరము
నలుగురటుల తర్కిమ్ప , బంజారా వారిగలిసె
మార్గదర్శి వెంటనిడుచు దారివెదుక ప్రియము బలికె

పండితులము మేమనుచు, బంజారా నిరసించి 
స్వతంత్రులై విహరించి, దారితెన్ను గాంచరైరి
అడవియదే అజ్ఞానము, వృక్షములే యరివర్గము
మార్గదర్శి నిరసించి , మరలజేరె తొలి చోటుకు

బంజారా మరలగలిసె , మార్గదర్శి విలువ బలికె
ప్రేమమీర ఆతిధ్యము  స్వీకరింప చలువ బలికె
ముగ్గురూ మిత్రులచట బంజారా నిరసించిరి
హృదయమున్న బంజారా విందుపొందె సాయిబాబ

అద్భుతమది యద్భుతమే ! వారిముందు గురువు నిలచె 
వృత్తాంతము విన్నపిదప , తనను యాశ్రయింప బలికె
మిత్రు లెటో వెడలిరి , బాబగురుని యాజ్ఞ వినిరి
తలక్రిందుగ బావియందు బ్రహ్మానందము గనిరి

గురుదేవు బహు దయాళు , వెన్నుతట్టె మనసుపట్టె
చక్కనైన తమబడిలొ , బ్రహ్మవిద్య బోధనిడిరి
వారిప్రేమపాశములొ వివశుడ,యతివివశుడాయె
క్షణమాత్రపు వియోగంబు నోపలేని శిష్యుడాయె

గురువె తల్లి గురువె తండ్రి, ఆస్తిపాస్తి గురువాయె
వారిరూపె కనులనిండె, వారిధ్యాస మనసుపొంగె
లోకమెల్ల గురువాయె , మనసు బుద్ధి స్తబ్ధ మాయె
సద్గురుని సన్నిధిలొ సర్వమును సాయి పొందె 
సద్గురుని సత్కృపతొ , తలక్రిందుగ బ్రహ్మ నెరిగె!

"ఉపవాసము జేసినంత, సరిభావము కుదరదింత"
గోఖలేభార్య పొంది  సందేశము బాబ నోట 
ఉపవాసమె తాను విడచెబొబ్బట్ల విందుజేసె !

బాల్యమందు బాబ వెడలిరి  బీడ్గామ్
భుక్తికొరకు కష్టపడిరి  , అల్లికల పనిపొందిరి
సాయిచక్కని సాలెవాడు,బహునేర్పరి సాలెవాడు
అల్లికలో కష్టపడి , ఆరువందల డబ్బుపొందె

యజమాని తృప్తిపొంది, నిండుదుస్తుల బహుకరించె
ఆత్మజ్ఞానమదియె చూడ , వెచ్చింపక సాయినిలిపె
మనుషులిచ్చు బహుమతులు బహుకాలము నిలువవుగ
దైవదత్త బహుమతులు , చిరకాలము శాశ్వితములె!

గురుఖజాన యమూల్యము, వెలగట్టని బహుమూల్యము
సరిపట్టరె యీజ్ఞానము , యీతరుణము మరిదొరకునె !  

ముప్పదిమూడవ అధ్యాయము

ఉది మహిమ బాహుమూల్యము , వివేకము వైరాగ్యము
సృష్టిలోని జీవులెల్ల  , బూడిదవును  తుదిరూపుగ
ధునిపంచిన వూది జూడ  పెక్కులీలల కాణాచి
ఇహపరంబులకిట  బహుచక్కని చింతామణి
తేలుకాటుపెనునొప్పికి  ప్లేగురోగ కడుబాధకు
ఇలలొ బహుకష్టములకు వూది గూర్చు మహసౌఖ్యము!

జాంనేరు లీల
జాంనేరు గ్రామము షిరిడికి బహుదూరము
మైనతాయికి ప్రసవము , బాధమిగుల కఠినము
చందోర్కరుకు చేష్టలుడిగెను , మందులమాకుల సరికాదాయెను
వేదనయెంతో యింతలాయెను , సాయివిభూతి కనరాదాయెను
నానా మదిలొ బాబ మెదలెను , బహువిధంబుల ప్రార్ధన జేసెను
కనులజలముల పొరలు గమ్మెను , అసహాయుండై సాయిని వేడెను .

అంతట షిరిడిలొ ...
రామగిరీబువ పయనమాయెను, జలగాముదిశ తనదేశమేగగ 
రెండు రూకలె జేబునుండె , బాబయతని  యచట బిలచి
విభూతి ఆరతి చాందోర్కరు కిమ్మనె
జలగాం మీదు జాంనేరు జేరుచు , ఖర్చుల చర్చలు మరిమది జేయక

రామగిరి జలగాం జేరెను, అర్ధరాత్రి  సమయంబున
బాపుబువా యను పిలుపును వినెను , జంటయశ్వముల శకటము గాంచెను
సంతసంబుతొ బండిని జేరెను, బండివానితొ జాంనేరుకు సాగేను
వేకువజామున పయనమాగెను , సెలయేటి తీరమున సేద దీరగ

సేవకునితొ ఫలహారము జేసెను, కొంతసేపటికి పయనము సాగేను
ఉదయమాయె జాంనేరు జేరగ , ప్రకృతిపిలుపుతొ పక్కకు వెడలెను
వచ్చునంత మరి శకటము మాయము , సేవకరూపము కనుల దూరము
చందోర్కరు  గృహము తానరుదెంచెను , విభూతి ఆరతి సరి అందించెను

జలముతొ విభూతి మరితాగించిరి , బాబా ఆరతి భక్తితొ పాడిరి
మైనతాయికి బాధతొలగెను , బాబాకృపతో బిడ్డకలిగెను
బాబాసాయే బండితొ వచ్చెను, బాలికగాచి లీలజూపెను!

అప్పాసాహెబు కులకర్ణి అతిఅదృష్టవంతుడు యటులనె 
బాబా నుండి యూది పొందెను, నవవిధభక్తిగ నాణెము లందెను!  


ముప్పదినాల్గవ ముప్పదిఐదవ అధ్యాయములు

సాయి చూపు చలువ
సాయిచేతి చలువ
సాయి ఊది చలువ
తెలియతరమె విలువ

రాచపుండులేమి
నారిపుండులేమి
ప్లేగుబొబ్బలేమి
ఊది అద్ద తొలగు

మూర్ఛబాధలేమి
మూత్రరోగమేని
ప్రసవవేదనేని
ఊదిమహిమ తొలగు

దైవము సగుణమా, నిర్గుణమా
నిర్గుణమనినమ్మే కాకాజీమిత్రుడు
సాకారదైవమును సాయిలోనె మిగులజూసె

మహిమజూడ వచ్చిన కాకజి యజమాని
విత్తులేని ద్రాక్షపొంది విస్మయమందె,
చాంచల్యము లేనిమనసె
చిత్తశాంతి మూలమెరిగె!

ఊదిశక్తి యది యూహకందునా,
బాబభక్త బాలాజీ ఇంటచూడరే!
కొద్దిమందికే వంటవండినా ,
ఎందరెందరొ విందుజేసిరి

సాయిమహిమది , ఊది మహిమది!
సాయిమహిమది , ఊది మహిమది!

ముప్పదిఆరవ అధ్యాయము

మనకలయిక ఇట రుణబంధమేగ
పరస్పర ప్రేమతొ  పెంచుదామీబంధము!
రుణముక్తికే బాబా భక్తుల దక్షిణ
కాసులకాశపడని గోసాయియె సాయిదేవ

గోవాపెద్దలిద్దరొచ్చినను...
రుణగ్రస్తుడు మొదటిపెద్ద ,
ముప్పదివేలు తానే ఇచ్చిన
రెండవ పెద్దనుండి ఏల దక్షిణ ?
పక్షపాతి కారులే సాయిబాబ !

పెద్దలయా , ఇద్దరయా  గోవపెద్దలు ఇద్దరయా
షిరిడీ నగరికి వచ్చిరయా , ద్వారకమయునికి మొక్కిరయా
పదునైదురూకల దక్షినడిగిరి మొదటివానిని సాయిదేవ
రెండవవాని దక్షిణ వలదనె , ఎవరికి ఎరుక వారిరువురి చరిత?

" ఫకీరునేను, పరులసొత్తెలారుణవిముక్తికే  అందెద దక్షిణ."
పలుకుచు సాయి గతము తెలిపిరి, వారల గాథల లీలగ జెప్పిరి

అతడు మిగుల పేదవాడు, ఉద్యోగము లేనివాడు
తొలిభత్యము నివ్వదలచె దత్తునకు, ... కొలువ గలుగ 
పదునైదు రూకల నౌకరాయె, పదోన్నతుల ఎన్నొ పొందె
నేను తగిన సొమ్మునడిగి , రుణభారము దీర్చితిని

రెండవవాని కథ ....
అదిసాగర తీరము, ఉల్లాస విహారము
అందమైన భవనము ఆతిధ్యము ప్రియము,ప్రియము
అర్ధరాత్రి సమయము, గాఢనిదుర శయనము
నా ధనము దొంగిలించె , బ్రాహ్మణ గోవ్యాఘ్రము

నిదురలేచి మిగుల వగచి అన్నపాన మిడిచితిని 
పదునైదురోజులా భవనమందు కుమిలి కుమిలి యేడ్చినాను
అంతటనోబాటసారి జాలిచెందె , నన్నుజూసి
సొమ్ముదొరకు విధము బలికి  చిత్తశాంతి యొసగినాడు

" ఫకీరుకడకు వెడలు , అహము విడచి శరణు వేడు
  ప్రియభోజ్యమునొకటి వదలు ధనము పొందువరకు ."
అటుల యటుల జేసితిని ధనము తిరిగి పొందితిని
తీరమేగి స్టీమరులొ యావలిదరి జేరితిని
అటునుండి పొగబండిలొ మజీదుమా యడుగిడితిని

బాబకథముగించెనంత,
శ్యామవారల  భోజనాల సత్కరింప.
పిమ్మట కనుల నీరు గ్రమ్ముకొన , తమపూర్వగాథ వివరించిరి
మొదటిపెద్ద యిటులబలికె

" గిరిప్రదేశ వాసిని, కొలువేసేయ వెడలితిని
  నౌకరేది దొరికినేని మాసవేతమిత్తునని
  దత్తునికి మొక్కితిని, దత్తదయను పొందితిని
  దక్షిణనే నేను మరువ , బాబ పిలిచి దక్షినందె ."

రెండవపెద్ద యనుభవము ,
" నమ్మినప్రియసేవకుడు , బ్రాహ్మణ కులజన్ముడు
   గాఢనిదుర సమయమందు, గోడరాయి తెలివి దీసి
   నిలువధనము నెల్లబట్టి, మిగులవ్యథను మిగులజేసె
   పక్షమటుల యారుబయట , దుఃఖముతొ కుంగిపోతి

   దారివెడలు ఫకీరు, నా దైన్యము దయతొ వినియె
   షిరిడిసాయి మనసునమ్మి  ఇష్టాన్నము విడువ బలికె
   గురుని షిరిడి సేవించిఇష్టాన్నము  విడుతునని
   శబధమటుల జేసితిని ధనమంతయు దొరకు వరకు

   సేవకునకు బుద్ధికుదిరె సొమ్మునంత తిరిగితెచ్చి
   పదములందు మొక్కిమొక్కి తనతప్పుకు మిగులవగచె
   మరలరాడు ఫకీరు , సాయిగాక ఎవరు యతడు
   అంతధనము కలుగజేసి దక్షిణేల కోరుసాయి...?

   ద్రవ్యమంత తిరిగిపొంద మిగులముదము మదిని కలిగె
   గతవచనము నేనుమరచి, సాయిజూడ వెడలకున్న
   బాబస్వప్నమాయెనాకు షిరిడిజేర తపనగలిగె
   స్టీమరున ముంబాయిజేరి , ఆపై పొగబండి పడితి

 మేముయెచటివారలము,ఏమిచెబుదు భాగ్యము?
 బాబనిచట దరిశించుట జనమ జనమ పున్నెము."
దత్తరూపు సాయిచట షిరిడిలొ విలసిల్లెలే
సాయిలీలనగరుజూడ మనలజనమ ధన్యమే!
సాయికరుణ కలిగినేని సర్వమిచట ప్రాప్తమె!

సఖారాం భార్యకు సంతానము లోపింప
ఆమె రేఖమార్చినాడు  ద్వారకమయి సాయిదేవ
మనుమలనెత్తు ముదిమిలోన  తల్లియాయె సాయిలీల!


ముప్పదియేడవ అధ్యాయము

బ్రహ్మానందులు బ్రహ్మచర్యులు ,సాయిదేవులు ఆత్మస్థితులు 
జాగృతిస్థితిలో జగత్కారకులు,నిద్దురలోన అప్రమత్తులె !

చావడి ఉత్సవము
బాబా నిదురకు వేళయింది, చావడివేడుక మొదలయింది
భజనకీర్తనల మంగళధ్వనుల భక్తుల యెదలే పొంగెనులే
తప్పట్లోయ్ తాళాలోయ్ చావడి సంబర మేళాలోయ్
రారండోయ్ చూడండోయ్ కన్నుల పండుగ నేడండోయ్

అందాలరధముతో తులసి బృందావనితొ  భక్తబృందాలే చిందేసేలె
తాళ  కరతాళ మృదంగ కంజరుల భజనబృందాలే విందాయెలే !
పల్లకీసేవలో పరమభక్తులరుగో  వెలుగుదివిటీలా బారులవిగవుగో
జయజయధ్వానాల దండధరులూ యరుగో

పూర్ణభూషిత హయము శ్యామకర్ణిక యదిగొ
శాంతచిత్తులు బాబ మాజీదు కూర్చుండ
మామపిలుపుతో తాత్య సాయిచెంతా జేరు
సటక చిలుములు బాబ సరిగచేపట్టంగ

సాయిసేవలొ తాత్య దుశ్శాలువా తోడ 
ధునిని సరిగా జేసి చేత దీపము దీసి
సాయి చావడికి కదిలినాడండోయి
మేళాలు తాళాలు మిన్నంటి మ్రోగెలే

టాపాసు జిలుగులు కనువిందు జేసెలే
మృదంగ వీణియల స్వారాల లయలతో
సాయికీర్తనలు,సాయిస్తోత్రములు  
తనువు మరచీ మరచి మనసు మురిసే వేళ

వూగె సాగేనట భక్తబృందములు
పూర్ణచంద్రులెజూడ సాయిదేవుండు
మాజీదునుండి వెడలినా డండోయి
కుడియెడంబుల చావరంబులే జూడు
భక్తకరమూల వింజామరలె వీయు

పట్టుపరుపులా బాబ యడుగులువేయు 
తాత్యమాల్సా పతి  భుజములా  చేతులు
జోగు ఛత్రముతో సాయినంటెలే
బ్రహ్మరూపుతొసాయి కాంతులీనేలే

సింగార హయము ముందు ముందూ నడువ
వాహనాదులు వాద్యబృందాలు కదలె 
హరి సాయి ఘోషలొ  షిరిడి పులకింప!
మలుపు సమీపించె  హనుమగుడీ చెంత 
మలుపునుండీ సాయి చావడీ  తిలకించు

చూడంగ బాబ బాలభానుండనగ
దక్షిణా హస్తంబు ఊర్ధ్వ నిమ్నము గదుపు
వాయిద్యంబులెల్ల యేక తాళము మ్రోగ
రజిత పాత్రంబులా రంగురంగుల పూలు
దీక్షీతు విసరు సాయిపై నపుడపుడు

మేళాలు తాళాలు మిన్నంటి మ్రోగంగ
కోటిసూర్యులతేజ కూటమే సాయి!
మాల్సపతి యట  మైమరిచి నర్తించు
భక్తిశ్రద్ధలకదియె చూడంగ కడయంచు.
బాబ చావడి జేరె భక్తబృందంబుతొ
సంబరంబులతాను యణువంత సడలక!

చావడి ఎలాఉందంటే ,
కల్యాణ భవనమది  లోకకల్యాణకరమది
ధవళ కాంతులీను దివ్వెలద్దముల 
సాయి యాసీనులు కోమల వేదికా
అంగార్కమకుటములు ముచ్చట గొలుపంగ

రత్నహారంబులె సాయికంఠము  నిండ
కస్తూరి తిలకములు నుదుట కాంతులీనె
కనులార్పకా జనులు  ముదముతో తిలకించు
సుందరాంగుని సాయి  యామందిరంబున!

గురుపాద మరియాద జోగు జేసే యచట
నిమోన్కరూ ఛత్ర  చిత్రముగ తిప్పంగ
చందనా తాంబూల మతిప్రియంబు గూర్ప
రాజాధిరాజుసాయి భక్త వింజామరుల !

చిలుము శ్యామా గూర్ప, తాత్య రగిలించు
బాబ చిలుమూ బీల్చి  భక్తులపంచె
చిలుము రూపూ ధన్య, ధన్యమె  యచట
సాయిపెదవీ కర మృదుస్పర్శతోడ.

గురుసేవ కుసుమ రాశులెన్నెన్నో
సుఖముగూర్చెనట   బహు పరిమళములా
అంతరంగానా లేశ చలనములేక
సాయిమిన్నా కుండె , భక్తబృందానడుమ

మధురమంగళముల సాగె ఆరతి అపుడు
గురుపూజ  భక్తులూ శాంతచిత్తులైరి
గురుసేవ భక్తులు ధన్యు ధన్యులైరి!
చావడి యాత్ర తలచి పులకించెదము,
నిదుర నిదురకుముందు సాయినే తలచెదము!


ఐదవభాగము  సంపూర్ణము 

శ్రీసాయినాథాయ నమః 
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు! 


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


Comments

  1. This post is the 5th of 7 parts of Sri Sai Ganamruthamu.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!