శ్రీసాయి సచ్చరిత్ర సంషిప్త గానామృతము -6 (మూలము: శ్రీసాయి సచ్చరిత్రము.)
శ్రీగణేశాయనమః,శ్రీసరస్వత్తైనమః,సమర్ధసద్గురు శ్రీసాయినాథాయనమః.
ముందుమాట!
ముందుమాట!
శ్రీసాయిలీలలను గానరూపంలో పాడుకో దలచువారికొరకు ఈ శ్రీ సాయిలీలలు గేయ రూపంలో వ్రాయడమైనది. సమయాభావముచే శ్రీసాయిచరిత్ర పూర్తిగా చదువుటకువీలుకానిచో , ఈ రచన చదువుటచే అధ్యాయ సారమును గ్రహింపవచ్చును. అధ్యాయముల భావసందేశముల బట్టి వాటి వాటి నిడివి మారినది. మొట్టమొదటిగా చరిత్ర పారాయణజేయువారు శ్రీసాయిసచ్చరిత్ర మూలగ్రంథ మును ఒక పర్యాయము పారాయణ జేసి ఆపై ఈ గేయామృతము చదివిన విషయ గ్రహణము సులభము కాగలదు. సప్తాహ పారాయణకు వీలుగ,మూలగ్రంధమువలె ఏడు భాగములుగ విభజించడమైనది. శ్రీసాయి కరుణా కటాక్షములు పాఠక భక్తులకు పరిపూర్ణముగా లభించుటకు మనఃస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నాను.
ఆరవభాగము (అధ్యాయములు 38-44)
ముప్పదియెనిమిదవ అధ్యాయము
పోతపోసిన బ్రహ్మతత్వమె సాయి
శరణు వారల శీఘ్ర రక్షణయె సాయి
నరునివేషపు నారాయణుడె సాయి
మరులగొలుపు మురళి ధరుడుయే సాయి!
అన్నిదానముల అగ్రదానము అన్నదానమె
అతిధిదేవుల కన్నమిడుటయె మిన్నదానము
జీవులెల్లర చల్లబరచును అన్నదానము
చాలు చాలను తృప్తినిచ్చెడి దన్నదానము.
సాయిదేవుల పక్వమైనది అన్నదానము
రుచులమెండుగ పంచునట్టిదె సాయిదానము
ప్రేమ శక్తి మిళితమైనది బాబ భాండము!
సాయిముస్లిమా,సాయి హిందువా?
రామ్ రహీమ్ ల ముద్దుబిడ్డడు
అల్లానామము నెపుడు వీడడు
హరిహరాదుల దేవరూపుడు
అల్లానామము నెపుడు వీడడు
హరిహరాదుల దేవరూపుడు
అందరీలో వెలుగు దేవుడు!
హేమాద్రిపంతుదె
యేమిపున్నెము?
సాయి చలువా మజ్జిగ త్రాగెను
సాయిలీలల మహిమ వ్రాసెను
సాయిలీలల మహిమ వ్రాసెను
లోకజనులా మిగుల పంచెను!
ముప్పదితొమ్మిదవ అధ్యాయము
బహువేషపు బాదుషయె షిరిడిసాయి
బహురూపుల తాపసియే షిరిడిసాయి
బహుభాషల కోవిదుడే షిరిడిసాయి
బహుపరాక్ బహుపరాక్ షిరిడి సాయి !
బాబా సంస్కత జ్ఞానము , గీతాశ్లోక వ్యాఖ్యానము
సాయిభావ కుంచెలో భాషలెన్నొ నిబిడము
దేవనాగరి,పారశీకము ఒకటి రెండా చెప్పతరమా ?
చాందోర్కరుడు బాబా సేవలొ
శ్లోకమొక్కటి స్మరించుచుండెను
గీతా, శ్లోకమొక్కటీ స్మరించుచుండెను
" తద్విద్ధి ప్రణిపాతేన
పరిప్రశ్నేన సేవయా
ఉపదేష్యన్తి తేజ్ఞానం
జ్ఞానినః తత్వదర్శినః "
" అమరము నెరిగితి , వేదము జదివితి
గీతను మరిమరి పఠనము జేసితి"
యనుభావమును మదిలొ నింపెను
చాందోర్కరుడు దర్పము పొందెను.
బాబా యాతని యూహ గ్రహించి
మనసున ఏమది వివరణ కోరెను
అంతట నానా శ్లోకార్థము వివరించెను
"సాష్టాంగబుల సరియగు ప్రశ్నల
సద్గురుసేవల బ్రహ్మము తెలియును
ఆత్మనుగాంచిన పరమగురువులే
బ్రహ్మపు జాడల నుపదేశింపగ "
బాబా ప్రతిపద యర్థము నడిగెను
వ్యాసుని భావన వివరణ కోరెను
నానాసాహెబు తడబడ సాగెను
తనకుతోచిన యర్థము తెలిపెను
ప్రణిపాతంబన సాష్టాంగంబనె
ప్రశ్న యడుగుటయె పరిప్రశ్నంబనె
పాదసేవయె సద్గురుసేవనె
బాబతొ సాగిన సంభాషణ మందున
బ్రహ్మజ్ఞానమే జ్ఞానంబనెను
సర్వజ్ఞునిగ శ్రీకృష్ణుని నమ్మెను
పార్ధుడు జ్ఞానుల శరణు పొందెటుల
భావము సాహెబు పొందకుండెను
ఆపై బాబా భాష్యమిటుల కొనసాగినది,
సాష్టాంగంబె సర్వము కాదు సద్గురుసేవలొ తనను మరువవలె
ప్రశ్నలన్యము యల్పము యల్పము పరమార్ధమునిడు ప్రశ్నయె ప్రశ్న
అహమునె విడచి దేహము మరచి గురుని కొలుచుటే నిజమగు
సేవ
సరి తరుణంబున గురునుపదేశము జాలువారు మరి యమృత ధారగ
జ్ఞానమనా అజ్ఞానము తొలగుట, తేజమనా తిమిరము వీడుట
ద్వైతము వీడుటే అద్వైతము కూడుట , ఇదియే ఇదియే గీతాసారము
పరిపూర్ణజ్ఞానమె సద్గురు రూపము, దృక్కోణపు శ్రుతియే యాతని ఘనము
మనీషి క్రతువే గురుని నైజము, మహిమాన్వితమె
సద్గురు తత్త్వము
నిర్గుణ రూపమె సద్గురు తేజము, సచ్చిదానందమె శ్రీగురు డెందము
లోకోద్ధరణమె సగుణకార్యము, సగుణ నిర్గుణ భేదము శూన్యము !
అంతేవాసియు అంతే ఘనుడు, గతవాసనలె ఇంతకు మూలము
శిష్యుని లేశము శిష్యుని క్లేశము, నిర్మూలనమె గురునుపదేశము
జన్మల కర్మల పాపపంకిలము , యనల్ప భావము జీవికి దోషము
దోషము బాపుటే గురుని లక్ష్యము,
తేజము నింపుటే సద్గురు కార్యము
భక్తునిగురువే భగవంతుండు , వారిరువురి క్షేమము శ్రీ కృష్ణుని పరము!
బాబా భాష్యము యంతట ముగియ , చాందోర్కరుని దర్పము తొలగెను.
అంతరంగుడు సాయి పాండురంగడు సాయి
కుశలకర్ముడు సాయి , బహుళనేర్పరి సాయి
బూటి స్వప్నమున వాడ మెదలెను,శ్యామ కలలొ అదె వాడనిలిచెను
బాబయనుమతి వాడవెలసెను,అందచందాల వాడవెలసెను
పూజమందిరమె యందునిలచెను,మురళీధరుని మూర్తి తలువ యట
బాబా దేహమె మూర్తి యాయెను, మురళీధర
మూర్తి యాయెను!
నలుబదియవ అధ్యాయము
ద్వారకమాయిన నిత్యసత్యవ్రతులు
ఆడితప్పియెరుగని హరిశ్చంద్రులు
మాటమార్చని శ్రీరామచంద్రులు
అగ్గివంటి దొర సాయిదేవులు!
ప్రేమమీర బిలువ వాలునతడు
సాయిరామయనగ పరుగులీడు
రైలు బస్సులు లేక జేరువాడు
రయము రయమున సేద దీర్చువాడు!
సాయిరమ్మనుచు దేవు లేఖవ్రాయ
మరి యిద్దరితొ వచ్చునటుల జాబుపంపె
ఉద్యాపనసమయాన, సన్యాసిగ విందుసేయ
దేవు ఎరుగడాయె సాయిలీల!
కలలొగూడ కల్ల లాడనోడు
సాయి షిరిడిబాబ మల్లెపువ్వు
స్వప్నమందు పంతుకు హోళినాడు
ముందుబలికి చిత్రముగ , విందు జేసినాడు !
నలుబదియొకటవ అధ్యాయము
చిత్రమైనది చిత్రపటము, ఆలీమహమ్మద్ బాంద్ర యింట
సాటిపటములు నీట మునగ సాయిపటమే చక్కనిలచె
కుశలకర్ముడు సాయిచంద్రుడు హోళిపండుగ శుభదినంబున
పంతునింట విందుసేయగ చిత్రరూపుతొ సరిగజేరె !
బి.వి. దేవ్ జ్ఞానేశ్వరి పఠనము
భగవద్గీతకు భాష్యమది జ్ఞానేశ్వరుడే వ్రాసినది
జ్ఞానేశ్వరియను నామముతోడను జగత్ఖ్యాతిని గాంచినది
బి.వి. దేవ్ తహసిల్దారు తానాజిల్లా దహనుశాఖకు
పుణ్యగ్రంధముల మిగుల పఠించె , జ్ఞానేశ్వరి చదువ దలంచె
ఏమి చిత్రమో యతి విచిత్రము
జ్ఞానదాయి జ్ఞానేశ్వరి పట్టగ
దేవుకు చిత్తము స్థిరముగ నుండదు
దుష్టతలంపులె ముప్పిరిగొనును
మూడుమాసములు శెలవును పొంది
షిరిడిమీదు తన గ్రామము జేరెను
మునుపటి జ్ఞానేశ్వరియె పట్టినా
మూడుపంక్తులు ముందుకు సాగవు
సాయి ఆసిసుల జ్ఞానేశ్వరి చదువగ
షిరిడినగరికి దేవు వెడలెను
సాయి తనమనసు నెరిగి , సమ్మతము తెలియజేయ
గ్రంధము పఠింతునని జోగుతొ బలికెను
దేవు బాబ దర్శించే , ఓ రూక దక్షినివ్వ
ఇరువదిరూకల నడిగి మరల మరల సాయి పొందె!
మధ్యాహ్న హారతచట బాలకరాము దేవు యడిగె
బాబకృప కలుగు యెటుల , ధ్యాననిష్ఠ కిటుక యెటుల
సాయి, దేవు పిలిపించి సంగతేమొ జెప్పుమనగ
బాలక రాము నోట
బాబ ఖ్యాతి వింటిననియె
మిగుల క్రోధుడయ్యె సాయి, మరలదక్షిణడిగె సాయి
" నా చిరుగు పీలికల దొంగిలించనేల" బలికె
దేవు యచట వెదకిజూడ పీలికలు కానరావె
"సూర్యుడెదురు వెలుగునివ్వ , దియ్య దియ్య దియ్య యేల
రాజె మిగుల కాన్కలివ్వ , సామాన్యుల నడుగనేల?"
నీవుదప్ప చోరులు మాజీదున
లేరుగ
వయసుపెరుగ బుద్ధితరుగ దొంగిలింప వత్తువా?
నా సొత్తును దొంగిలించి మిగుల బలుక జేసినావు
సాయిబలికె దేవు నచట బహు నిందా వాక్యముల
" కొలది కొలది పోతి చదువు మిగుల శ్రద్ధ, పరులు వినగ
నే మేలిమి వలువలివ్వ, పరుల నడుగు చిరుగులేల
విడువు విడువు చోరత్వము , నా చెంతా దాపరికము? "
సాయి బలికె సాంత్వనముగ , దేవుకెంతొ ప్రీతి గలుగ
పరమాత్మయె
ఎదుట నిలువ పరులనడుగు చిరుగులేల?
దేవు సాయిభావమెరిగి పోతి జదువ వాడ కరిగె
జ్ఞానేశ్వర పఠనమచట దేవుకంత సులువు కాదు
సాయిదేవ స్వప్నమాయె , కరుణతోడ నిటుల బలికె
" మనసునందు నన్ను నిలుపు, పదము పదము ఎరుక చదువు! "
దేవు యటుల చదివి చదివి, జ్ఞానేశ్వరి భావమెరిగె
సాయి సాయి సాయి కృపతో జ్ఞానేశ్వరి భావమేరిగె !
సాయి సాయి సాయి కృపతో జ్ఞానేశ్వరి భావమేరిగె !
నలుబదిరెండవ అధ్యాయము
సాయి సనాతన,సాయి సచేతన
సాయి సాకార సాయి నిరాకార
పాంచభౌతిక దేహంబు చాలించి
నిరాకారంబున నిత్య అప్రమత్తుడే!
విజయదశమి
నాడు
దేహసీమదాటినాడు
మరణంబునె
జయించి
శరణుండై నిలచినాడు!
లక్ష్మీబాయి పుణ్యురాలు,
సాయిసేవ ధన్యురాలు
నవవిధ భక్తులజూపి
సాయిచేత దక్షినందె!
చిన్న చిన్న దక్షిణలంది
తానే బాబ దక్షిణాయె
తాత్యాపాటిలు మృత్యువేళ
తనకు తానె దక్షిణాయె!
సాయి ఆనాడు అనంతుడు
సాయి ఈనాడు అనంతుడు
మట్టిరూపు మట్టిగలియ
బ్రహ్మసాయి వెలుగు మిగిలె!
సాయి సాయని ఆర్తితొ బిలువ
నేనున్నానని అంటున్నాడు
నీవే నాకు దిక్కని తలువ
నావికుండై
నడిపిస్తాడు,
నాయకుండై
కరుణిస్తాడు !
నలుబది మూడు, నాలుగు అధ్యాయములు
గురునికృప ఇటుక విరుగ
తనదేహము విడువ దలచె
బాయిజాబాయి ఋణముదీర్ప
తాత్యకై తానె వెడలె!
చరాచరకూటమిలొ
చేతనమై మిగిలినాడు
నేను నాది మదిని మరువ అందరిలో వెలుగువాడు
సాయినామ స్మరణముచే మరణమునే త్రుంచువాడు
సాయి నీవె శరణంటే నీడలా వెన్నంటుతాడు
కాలమంత నిండినాడు, నిన్నరేపు నున్నవాడు
నమ్ముకున్న తమ్ముళ్లకు పండు ఫలము లిచ్చువాడు
మనసువిప్పి
సాయియనరె, తనువుమరచి సాయియనరె
రెండురోజుల మజిలీలో సాయితోడ ముడివడరె !
ఆరవభాగము సంపూర్ణము
శ్రీసాయినాథాయ నమః
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికి శుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
సద్గురు శ్రీసాయినాథార్పణమస్తు!
This post is the 6th of 7 parts of Sri Sai Ganamruthamu.
ReplyDelete