సందేహము-సమాధానము

ఓం శ్రీసాయినాథాయనమః 

పాలకొల్లు దేవాలయములోని బాబా మూర్తి 

సాయిబాబా తమ భక్తులకెన్నో అనుభవాల ప్రసాదిస్తూ, తమ ఉనికిని, తమ భక్తరక్షణా కార్యక్రమాన్ని  నిత్యం తెలియజేస్తూనే వున్నారు.కొన్నిసమయాల్లొ మన ప్రారబ్ద కర్మల బలంచే బాధలు, సమస్యలు  కొనసాగుతూనే ఉంటాయి.  బాబా మనల  మరిచారా అనే సందేహం మనసుల తొలుస్తుంటది. అందుకే మామిడి పూతలా రాలిపోక, శ్రద్ధా సహనాల తో , పరిపూర్ణవిశ్వాసంతో 

ముందుకు నడవాలి. చీకటి సొరంగముచివర వెలుగులా, రేయి వెంబటి పగలులా జీవితంలో ఉషోదయం తప్పక కలుగుతుంది. అలాగే భక్తులు కూడా ఎన్నో అనుభవాల చవిజూస్తూ కూడా, బాబా పై పూర్తివిశ్వాసముంచుటకు ఎంతో సంకోచిస్తుంటారు. ఇది ఇప్పటి విషయం కాదు. బాబా దేహరూపంలో ఉన్నపుడు వారిని ఎంతో భక్తిశ్రద్ధలు పూజించిన  భక్తులుకూడ ఇలాంటి సంశయాలకు దూరులు కాలేక పోయారు. ఉదాహరణకు బాబా అత్యున్నతస్థాయి భక్తశ్రేణిలో ఒకరైన కాకాసాహెబు దీక్షితుని గురుంచి కొద్దిగా వివరించుకొందాము. ఆయన బాబామాటపై పూర్తినమ్మకం కలిగివుండే వారు. ఆయనకు బాబావాక్కే బ్రహ్మవాక్కు. అతిఆచార పరాయణ  బ్రాహ్మణుడై యుండికూడ బాబా ఆదేశంపై  మేకను నరుకుటకు సిద్ధపడ్డారు. అంతటిది ఆయన విశ్వాసం. అలాగే బాబాకూడా ఎన్నెన్నో అనుభవాల ప్రసాదించారు. విమానంలో తీసికెళ్తానని చెప్పి, రైలు ప్రయాణం చేసేటప్పుడు అతిసునాయాస మరణాన్నికూడా సమకూర్చారు. అలాంటి దీక్షితుకు కూడ  బాబా రక్షణ, ఉనికి పై  ఎంతో  సంశయమేర్పడినది. ఆ విషయం  పరిశీలిద్దాం. 
బాబా మహాసమాధి  చెందిన తరువాత ఒకనాడు ఉదయము బొంబాయి చోపాటిలోనున్న కాకామహాజని ఇంటిలో దీక్షుతు ఏకనాథ భాగవతమును చదువుచుండెను. అచటనున్న శ్యామా, కాకామహాజని కూడ శ్రద్ధతో భాగవతము వినుచుండిరి. ఆనాటి విషయము నవనాథులు జనకమహారాజుకు భాగవత ధర్మసూత్రములను వివరించు చుండిరి. దాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు గురుని లేదా హరి పాదారవిందముల స్మరించుట. పారాయణ ముగిసిన పిమ్మట దీక్షితు ఎంతో నిరుత్సాహపడి శ్యామాతో , అలాంటి పరిపూర్ణ భక్తి విశ్వాసాలు కలిగియుండటం మనలాంటివారికి వీలగునా యని సందేహం వెలిబుచ్చాడు. 
అందులకు శ్యామా ఇష్టపడక , సాయిలాంటి నిత్య సత్య  సద్గురుని పొందిన వారు ధన్యులు, వారిపై విశ్వాసముంచిన వారికి భయాందోళనలకు అవకాశము లేదని చెప్పెను. కాని శ్యామా మాటలకు దీక్షితు సమాధాన పడలేదు. ఆ మరుసటి ఉదయమే, ఈ అనుమానానికి సమాధానమా అన్నటుల  ఓ అద్భుతం జరిగినది. పాఖాడే యనువ్యక్తి శ్యామాను వెదకుచు పురాణస్థలానికి వచ్చెను. తనకు బాబా స్వప్నమైనదనియు, శ్యామాసహాయమున బాబా పాదములకు నమస్కరించి వారినుండి ఎలాంటి భయాందోళనలు లేని  పరిపూర్ణ రక్షణ పొందితినని; కృతజ్ఞతగా బాబా సలహాపై  శ్యామాకు పట్టుపంచె నిచ్చుటకు వచ్చితినని చెప్పెను.  చీటీలు నిర్వహించుటచే శ్యామా  పంచె నంగీకరింపవలసి వచ్చెను. పాఖాడే వివరణచే కాకాసాహెబు సంతుష్టి చెందెను.
 ( ఈ వివరాలన్ని శ్రీ సాయిసచ్చరిత్ర 45 వ అధ్యాయములో చూడవచ్చును.)


ఆనందరావు పాఖాడే 

ఇలాంటి అనుభవమే  నాకు 1996, సెప్టెంబరు 23 న  పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు బాబా దేవాలయానికి దగ్గరగా జరిగినది.అప్పుడు నేను ONGC లో పనిజేస్తున్నాను. నేను పనిజేస్తున్న బ్రాన్హాం రిగ్గు పాలకొల్లు కు సమీపంలో ఉండుటచే అపుడపుడు పాలకొల్లు బాబాగుడికి తోటి సహచరులతొ వెళుతుండేవాడిని. అప్పటికి కొన్నినెలల మునుపే బాబా విగ్రహ ప్రతిష్ట జరిగినదని తెలిసినది. ఈ క్రమంలో దేవాలయ అధ్యక్షులు శ్రీ అల్లం సత్యనారాయణగారితో పరిచయమేర్పడినది. ఆయన యువకులు , బాబాపై పరిపూర్ణ  భక్తి, విశ్వాసములున్న వ్యక్తి.  నిర్వాహకులందరు యువకులే. మాటల్లో ఆ దేవాలయమేర్పడటానికి ముందు జరిగిన ఎన్నో ఆసక్తి కర  విషయాలు చెప్పారు. 
అలాగే ఓరోజు సాయంత్రం  నేనొక్కడనే బాబాగుడివైపు కాలువప్రక్కన రోడ్డుపై  నడచుకొంటూ వెళు తున్నాను. కొద్దిదూరం  వెళ్ళాక ఏవో వింత ఆలోచనలు, ఎన్నో సందేహాలు, అనుమానాలు, నిజంగా బాబా ఉన్నారా? నేను సమయం వృధాచేసికొంటున్నానా? ఇలా ఎన్నో ప్రశ్నలు.  ఈ ఆలోచనలతో నడకగూడ కొద్దిగ మందగించింది. ఆలా రెండు నిముషాలు నడచానో లేదో, ఎదురుగా సత్యనారాయణగారు ఒక్కరే నడచుకొంటూ వస్తున్నారు. చాల రోజుల పిమ్మట కలియుటచే ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. ఎందరెందరో భక్తులు వారికి కలిగిన అనుభవాల మూలాన విరాళాలిస్తున్నారని, సంతానం లేనివారికి బిడ్డలు కలుగుతున్నారని, ఎందరో ఆరోగ్యులవుచున్నారని  మరెన్నో విషయాలు ఎంతో ఉత్సాహంతో షుమారు 15 నిముషాలు పైన మాట్లాడారు.
నాలో క్రమంగా సందేహం పలచబడి, మరలా విశ్వాసం దృఢపడినది.  దూరమునుండి, ఎందరో బాబాగుడికి ప్రదక్షిణం చేయడం చూసాను. ఇలా నాలో అపుడపుడు అనుమానం తొంగిచూసినపుడు, బాబా ఎదో రూపేణ సమాధానమిస్తున్నారు. మన అనుభవాల నమ్ముకొంటే బాబాకు తక్కువ సమయంలో మరింత సన్నిహితులం కాగలమని దృఢంగా నమ్ముతున్నాను. బాబా  గుడి అనుభవం నాలో ఓ ప్రేరణాగీతాన్ని స్ఫురింప జేసినది.

క్షీరాపురీ  ఇది క్షీరాపురి 

క్షీరాపురీ....  ఇది క్షీరాపురి 
శ్రీ షిరిడినాథుడే నెలవున్న కొలువున్న 
లీలాపురి ఇది క్షీరాపురి 

మా అమ్మ గోదారి పాదాల ఈనేల 
బంగారు బంగారు మాగాణిలే 
ఆ తల్లిఒడినే విడిదిల్లుగా జేసి 
క్షీరాపురిలొ సాయి వెలిశాడులే 
కల్యాణమూర్తిగా కలిగాడులే                                          || క్షీరాపురీ  ఇది క్షీరాపురి || 

పరమశివుడే సాయి అమరశిల్పియె సాయి 
కుశలకర్మలతోటి  దశల మార్చూనోయి 
తా... మందిరపు రూపు  భక్తులా యెద దెల్పి 
తల్లిగోదారి దరి వెలిశాడులే 
కారుణ్యమూర్తిగా కలిగాడులే                                         || క్షీరాపురీ  ఇది క్షీరాపురి || 

వెన్నదొంగా సాయి  వేంకటేశుడు సాయి 
భక్తులా మనసుల పాశమేయూ నోయి 
అనుకోని ఆపదల  అంతలోనేబాప 
ఈ శివాపురిలోనే వెలిశాడులే 
సత్యధర్మము నిలుప నిలిచాడులే                                   || క్షీరాపురీ  ఇది క్షీరాపురి ||   


శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


పాలకొల్లు  బాబా దేవాలయము 


Comments

  1. Quick response, an experience at Palakollu Baba temple.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!