పరాశక్తిస్వరూపుడు సాయినాథుడు !
శ్రీసాయినాథాయనమః
బాబా అంకితభక్తుడు రఘుబీర్ పురంధరే అనుభవం
రఘువీర్ పురంధరే బాబాకు ప్రియభక్తుడు. ఆతని తల్లి పండరి విఠలుని దైవంగా పూజించేది. ఓసారి పురంధరే తల్లితో బాబాను దర్శించాడు. పిమ్మట తల్లి పండరి వెళ్లాలని మరీ మరి తొందరసేయసాగింది. మరల బాబాను చూడటానికి వెళ్ళినప్పుడు బాబా స్థానంలో ఆమెకు పండరి విఠలుని దర్శనమయింది. పండరి యెపుడు వెళుతున్నావమ్మాయని బాబా కొంటిగా నవ్వారు. ఇంకెక్కడి పండరి, నా రంగడు కనులముందున్నాడు. ఆ రంగడు మాట్లాడడు, ఇచట మాట్లడే విఠలుడున్నాడని తన పండరిప్రయాణం మానుకొన్నది. బాబా ఎంతటి కరుణామయుడు. పిలిస్తే పలికే దైవము. ఇతర దేవీ, దేవతల ప్రసన్నం చేసుకోవడము అసాధ్యం కాకపోయినాయెంతో కష్టంతో కూడుకొన్నపని. కేవల భక్తి , శ్రద్ధలతో బాబా భక్తుల వద్దకు పరుగెడతారు. ఈ సమీప మార్గానికి అందరు అర్హులే! పై భావానికి అక్షరరూపమే ఈక్రింది భక్తిగీతము
మాట్లాడే విఠలుడమ్మా!
మాట్లాడే విఠలుడమ్మా చూసివద్దామా
నడయాడే రాముడమ్మా మొక్కుకుందామా
పోదామా పోదామా శిరిడి పొదామా
చూదామా చూదామా సాయి చుదామా
ద్వారకలో కృష్ణుడు దూర.. దూర మున్నాడు
కలిజనుల అలజడుల కదలక జూస్తున్నాడు
ద్వారకమయి దేవుడు సాయి గోవిందుడు
గీత గానముతోడ మురళి నూదుచున్నాడు
మన తనువుల శిరిడీకి పడినీడ్చు చున్నాడు
మన మనసుల శిరిడీకి వడి లాగుచున్నాడు || పోదామా పోదామా ||
అయోధ్య రాముడు అలకబూని యున్నాడు
అయో రామ అంటున్నా అంటనట్టె యున్నాడు
సాయిరాము జూడరే సాయమై యున్నాడు
మనబాధల మనగాథల ఆలకించు చున్నాడు
మన తనువుల శిరిడీకి పడినీడ్చు చున్నాడు
మన మనసుల శిరిడీకి వడి లాగుచున్నాడు || పోదామా పోదామా ||
కాశిలో పరమశివుడు కరుణజూప కున్నాడు
అభిషేక అర్చనల ఆదరింపకున్నాడు
శిరిడీ లోని శివుడే చిందు వేయు చున్నాడు
భక్తకోటి కష్టముల గరళముతో నిండినాడు
మన తనువుల శిరిడీకి పడినీడ్చు చున్నాడు
మన మనసుల శిరిడీకి వడి లాగుచున్నాడు || పోదామా పోదామా ||
ఆదినారాయణుడు అటులనే యున్నాడు
క్షీరసాగర తలమున యోగనిదుర నున్నాడు
నారాయణుడె శిరిడి నరునిరూపు నడచినాడు
లీల పారణల మనల పాలించుచున్నాడు
మన తనువుల శిరిడీకి పడినీడ్చు చున్నాడు
మన మనసుల శిరిడీకి వడి లాగుచున్నాడు || పోదామా పోదామా ||
ఏడుకొండల సామి ఆదమరచి యున్నాడు
శ్రీదేవి భూదేవుల నూయ లూగుచున్నాడు
సాయి తిరుమల సామి ఏమరక యున్నాడు
కోరుకున్న వరములా గుప్పించు చున్నాడు
మన తనువుల శిరిడీకి పడినీడ్చు చున్నాడు
మన మనసుల శిరిడీకి వడి లాగుచున్నాడు || పోదామా పోదామా ||
పరబ్రహ్మ ఏమిటో తెలియరానిది
పరాశక్తి ఏమిటో తెలుపలేనిది
రూపుదాల్చిశిరిడీలో జోతి యైనది
పరబ్రహ్మ పరాశక్తి ప్రాప్తమైనది
మన తనువుల మన మనసుల
వడి లా...
...... గుచున్నది! || పోదామా పోదామా ||
సాయిబాబా కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
Comments
Post a Comment