సాయి ఖండాంతర లీల 2

శ్రీసాయినాథాయనమః 


" నాముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రీపగలూ మీ చెంత నేనుండెదను. నాదేహము నిచ్చట నున్నప్పటికి సప్తసముద్రముల కవ్వల మీరుచేయుచున్న పనులు నాకు తెలియును. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే యుండెదను. నా నివాసస్థలము మీహృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే యున్నాను. ఎల్లప్పుడు మీ హృదయములలోను సర్వజన హృదయములందుగల నన్ను పూజింపుడు. ఎవ్వరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు  ధన్యులు; పావనులు; అదృష్టవంతులు." శ్రీసాయిసచ్చరిత్రము, అధ్యాయము 15.     

బాబా మహాసమాధియై కేలండర్ ప్రకారం ఈరోజుకు 100 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, వారి నిత్యసత్య లీలలు విశ్వంలో వ్యాపిస్తూనే యున్నాయి. సాయిమహరాజుకు శతకోటి వందనాలు! 

సూరీ కాకాజీ , హ్యూస్టన్ లో నాకు ఇరువది సంవత్సరములుగా తెలిసిన సాయి భక్తులు. ఆయన తమ అనుభవాలనిలా పంచుకొన్నారు. 

నేను గుజరాతునుండి 1977 లో హ్యూస్టన్ వచ్చాను. ఇచట iskcon టెంపుల్ కు వెళుతుండేవాడను. అచట పరిచయమైన ఓ స్నేహితుడు తమ ఇంట్లో పూజ, సత్సంగము చేస్తున్నామని నన్ను రమ్మని ఆహ్వానించారు. అది 1978 సంవత్సరంగా గురుతు. పూజలో  అనేకదేవుళ్ళతోపాటు సాయిబాబా ఫోటోలు  కూడా  పెట్టారు. ఆరోజుల్లో బాబాగురించి పెద్దగా ఎవ్వరికి తెలియదు. నాకుకూడా ఓ బాబా ఫోటో కావాలని మిత్రునితో అన్నాను. తనవద్ద వేరే ఫోటోలు లేవు, కాని  మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పక దొరుకుతుందని చెప్పాడు. ఆ తర్వాత బాబాఫొటో కొనాలని ఇచట హ్యూస్టన్ లోని అన్ని ఇండియన్ దుకాణాలకు తిరిగాను. ఎక్కడా ఒక్కఫోటోకూడా దొరకలేదు. కొద్దిపాటి నిరాశతో ఇంటికెళ్ళాను. 

ఇదిజరిగిన కొన్నిరోజులకు ఉదయం  ఓ  వ్యక్తి  మా ఇంటికొచ్చాడు.తనకు కొద్దిగా డబ్బు అవసరమని, తాను తనదగ్గరనున్న లాకెట్/పెండెంట్  బదులుగా ఇస్తానని  నాచేతిలో పెట్టాడు . పెండెంట్ పరిశీలించిచూస్తే మధ్యలో షిర్డిసాయిబాబా ఫోటో ఉంది. కొద్దిసేపు నేను నమ్మలేకపోయాను. 

డబ్బులెంతని అడిగితే ఓ ఇరవై డాలర్లు ఇవ్వండని గుజరాతీలోనే చెప్పాడు.అలానే చెప్పినంత ఇచ్చాక ఆ మనిషి వెళ్ళిపోయాడు. తరువాత ఆలోచిస్తే ఆ వ్యక్తిని అంతకుమున్నెప్పుడూ చూసిన దాఖలాలు  లేవు. ఇదిజరిగాక గడచిన నలుబది సంవత్సరములలో కూడ ఆతని ఆచూకి లేదు. ఇప్పటికి ఆశ్చర్య మనిపిస్తుంది.

మరో సందర్భం, దుర్గా పూజల సమయం. అమ్మవారిపూజ మా ఇంట్లో చేసుకొంటున్నాము. చాలామంది స్నేహితులను పిలిచాము. పూజావేదిక చక్కగా అలంకరించాము. మనసులో బాబాను కూడా ఆహ్వానించాలని తోచింది. ఓ చిన్న స్లిప్ మీద బాబా, పూజకు  మా ఇంటికి తప్పక రావలసినదని వేడికోలుగా వ్రాసి పూజా మందిరంలో ఆ కాగితముంచాను. పూజ బాగుగా జరిగినది. అందరు సంతోషపడ్డారు. భోజనాలయిన  పిమ్మట క్రమంగా అతిధులందరు ముందు ద్వారంగుండా  వెళ్లిపోయారు. 

నేను వెనుదిరిగి లోపలి కెళ్తుండగా, వెనుకవైపు గదినుండి బాబా మెరుపులా పూజాగదిలోకి వచ్చారు. పూజా స్థలం వద్ద చాలాకొద్దిసమయం నిలబడ్డారు. బాబా, బాబా వచ్చారు  అంటూ పెద్దగా అరుస్తూ ఇంట్లో వారికి చెప్పడానికి లోని కెళ్ళాను. అందరం పూజాగదిలోకి పరుగెత్తేసరికి అక్కడెవరూ లేరు. 

బాబాకోసం అన్నిగదులు వెదికాము. కాని ఏమాత్రం ఆచూకీ లభించలా ! మాకందరికి అంతుపట్టని విషయమేమంటే ఇంట్లోని వెనుకవైపు గదులన్నీమూసియున్నాయి,మా ఇంట్లోని మిగతావారుగూడ బాబారావడం  చూడలేదు, మరి బాబా యింట్లోకి యెట్లా ప్రవేశించారు,అంతత్వరగా ఎలా మాయమయ్యారు?  నా ప్రార్ధన మన్నించి నాకు రెప్పపాటు దర్శనమిచ్చి  మా పూజాగృహమును  పావనము జేశారు, ఇదియంతయు సాయికరుణ గాదా ! అదే బాబా మహిమగా తోస్తుంది.     


అంతర్యామి


అంతర్యామి .... అంతర్యామీ,
సాయి సాయీ  సర్వాంతర్యామి  ||2||

కలిసమయములో కలిగిన దేవా
పలురూపాల ప్రభవించావు
పండరిలోన ప్రభుడవు నీవే
పావన గంగా ధరుడవు నీవే                                        || అంతర్యామి .... అంతర్యామీ ||

శునకమునందు మెదలితివయ్యా
చిత్రముతోటి కదలితివయ్యా
ఎల్లలు నీకు లేవుగ దేవా
లోకాలన్నీ నీవే గావా                                                 || అంతర్యామి .... అంతర్యామీ ||

అల షిరిడీని విడువని నీవు
నలుదెసలందు వెలుగైనావు
ద్వారకమాయి నిలయుడవైనా
మా యెదలందు కొలువైనావు                                     || అంతర్యామి .... అంతర్యామీ ||

మోహపు తెరలా జిక్కితిమయ్యా
దాహపు జగతీ దోషులమయ్యా
ఆరతులివియె అందుకొ దేవా
లీలగమమ్ము బ్రోవగ రావా                                          || అంతర్యామి .... అంతర్యామీ ||

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!





Comments

  1. సాయిబాబా సర్వవ్యాపకులు, అన్నిదేశాల వారికి వారి ఉనికిని చూపుతున్నారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!