శ్రీసాయిబాబా నిత్యసత్యులు,అప్రమత్తులు!
శ్రీసాయినాథాయనమః
" నేను అప్రమత్తుడను,సమాధినుండియే నా భక్తుల రక్షించెదను! " సాయిబాబా
శ్రీసాయిబాబా మహాసమాధి చెంది తిధులప్రకారము నేటికి (అక్టోబర్ 19,2018) శతవసంతాలు పూర్తయినవి. విశ్వవ్యాప్తంగా గత యేడాదినుండి జరుగుచున్న శతాబ్ది వేడుకల భక్తి,శ్రద్దల మహాయజ్ఞం నేటితో ముగుస్తుంది. ఈసందర్బంగా కేవలం బాబాపై ప్రేమతో ఉడుతాభక్తిగా సమర్పించిన కుసుమహారమే ఈ చిరు సాయిలీలతెలుగు బ్లాగ్. వెబ్ కు సంబంధించి ఎలాంటి అనుభవము,పరిజ్ఞానము, భాషాపరంగా పాండిత్యములేక కేవలము సాయికరుణతో మరియు పూజ్యగురువర్యులు శ్రీ C.B.శతపతి గారు, శ్రీ రేవాడ గోపాలరావు గారు (సాయిబానిస ),శ్రీరామచంద్ర చైతన్యస్వామి వారల ఆసిసులు; కొందరి సాయిభక్తుల ముఖ్యముగా శ్రీ A.త్యాగరాజుగారి సహాయ సలహాలతొ, మీ అందరి సహకారంతో ఏర్పడి నడుస్తున్న యీ బ్లాగును బాబాభక్తియజ్ఞ సమిధగా సమర్పిస్తున్నాను.వీరెల్లరకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. సాయిభక్తులెల్లరకు బాబా శుభాశీసులు దండిగా మెండుగా లభించాలని సమర్థసాయినాథుల వినయపూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.
" శరీరమున్నన్నాళ్లు బాబా బ్రతికి యుండిరా? శరీరము పోయినదిగాన చనిపోయినారా? లేదు ఎల్లప్పుడూ జీవించియే యున్నారు. వారు జనమ మరణములకతీతులు. ఎవరైతే బాబా నొకసారి హృదయపూర్వకముగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికి ఎట్టిసమయమునందుగాని బాబానుండి తగిన జవాబు పొందెదరు. వారెప్పుడూ మన పక్కనే యుందురు. ఏరూపములోనో భక్తులకు దర్శనమిచ్చి వానికోరికను నెరవేర్చెదరు." శ్రీసాయిసచ్చరిత్రము, 33వ అధ్యాయము
సాయిబాబా తమభౌతిక దేహము చాలించినప్పటికి నిరాకార విశ్వచైతన్య తేజోమయరూపులుగా సదా ప్రకాశిస్తూనే యున్నారు. వారు దేహరూపులుగా ఉన్నప్పుడే కొన్నిసందర్భాలలో తమ తేజోమయ దేహాన్ని ప్రదర్శించారు. అలాంటి ఓ ఆశ్చర్యకర ఘటన గురించి తెలిసికొందాము. శ్రీమతి రామచంద్ర తార్ఖడ్ తన పుత్రుడు జ్యోతిన్ద్ర రామచంద్ర తార్ఖడ్ తో కలిసి బాబాదర్శనానికై షిరిడీ వెళుతుంది.( శ్రీసాయిసచ్చరిత్ర 9వ అధ్యాయము). అచట సాయిబాబా తల్లీ తనయులకేన్నో అనుభవాల చూపారు. ప్రస్తుతం జ్యోతిన్ద్ర తార్ఖడ్ చుసిన శ్రీసాయి లీల వివరాలు పరిశీలిద్దాం.జ్యోతిన్ద్ర రామచంద్ర తార్ఖడ్ అనుభవం
ఓ పర్యాయం బాబా జోతిన్ద్రను తమవెంట తీసికెళ్ళి ఓ పని అప్పగిస్తామని ఇలాచెప్పారు." భావూ ఈచిన్నపని చేసిపెట్టు. నేను స్నానం చేసేటప్పుడు, దయచేసి నే విడిచిన కఫనీని ఉతికిపెట్టు. ఉతికిన పిమ్మట నీవు రెండుచేతులతో నేలను తాకకుండా యెత్తి ఆరబెట్టు. నేను స్నానానికి చాలసేపు తీసుకుంటాను గాబట్టి స్నానం పూర్తయ్యేసరికి ఆరిపోతుంది. నేను మరలా ధరిస్తాను. జాగర్తసుమా , ఆరేటప్పుడు కఫనీ నేలతాకరాదు. జోతిన్ద్ర అందుకంగీకరించాడు.
వారిరువు లెండీబాగ్ కు వెళ్లారు. అచట నాలుగుపక్కల రేకులతో కట్టబడిన ఓచిన్న స్నానాలగది ఉంది. మధ్యలో కూర్చోవడానికి ఓ పెద్దబండరాయి ఉంది. బాబా స్నానం చేస్తుండగా కఫనీకోసం బయట జోతిన్ద్ర వేచిచూస్తున్నాడు. ఎంతసేపటికి బాబా కఫనీ ఇవ్వకుండుటచే అతనిలో అసహనం చోటుచేసుకొంది. ఇదికూడా బాబా చమత్కారమేమో యని అనుకొని, తన ఆత్రం ఆపుకోలేక తలుపు చిన్నసందుగుండా చూసాడు.ఆతనికి నమ్మశక్యంగాని ఓ దృశ్యం గోచరించింది. బాబాశరీరంలోని ప్రతి అణువునుండి కళ్లుమిరుమిట్లు గొలిపే కాంతికిరణాలు వెలువడుతున్నాయి. ఆదివ్య తేజోమయదేహాన్ని చూడలేక కనులుపోతాయేమోనని భయపడ్డాడు.
దానికితోడు తానుచేసిన తప్పుగూడ బయటపడుతుందనే ఆందోళన. అదేసమయంలో బాబా యతని పిలిచి కఫనీ ఇచ్చారు. జోతిన్ద్ర బావివద్ద కఫనీని సబ్బుతో ఉదికి, నీళ్ళుపిండి అమండుటెండలో రెండుచేతుల ఎత్తిపట్టాడు. మొదట్లో అతడు కఫనీబరువు భరించగలిగాడుకాని , సమయంగడిచేకొలది తగ్గుటకుబదులు బరువు పెరగనారంభించింది. త్వరలో కఫనీ నేలతాకి తాను పరీక్షలో ఓడిపోతానని భావించాడు. బాబాపరీక్ష నెగ్గుటకు శక్తికోసం ఆంజనేయస్వామిని ప్రార్ధించడం మొదలుపెట్టాడు. కాని బాబా సర్వాంతర్యామిగదా, యాతని మనసునెఱిగి, " ఓ భావూ ఆంజనేయస్వామినేల పిలుస్తున్నావు? " యంటూ కేకలేయడం మొదలెట్టారు. జోతిన్ద్ర తనతప్పుగ్రహించి బాబాను క్షమించమని, అలాంటిపొరపాటు మరెన్నడూ చేయనని వేడుకొన్నాడు. బాబా శాంతించడంతొ, క్షణాల్లో కఫనీబరువు తగ్గి తేలికయింది.బాబానుండి మనమేది దాచవీలుకాదని గ్రహించాడు.
ఇలాంటి తేజోమయ రూపాన్ని శ్రీకృష్ణపరమాత్మ తమవిశ్వరూపసందర్శనలో, అర్జునునికి దర్శింపజేశారు.అప్పటి అర్జునుని భావము.
"హే విష్ణో ! కిరీటమును,గదను,చక్రమునుధరించి, అంతటను తేజఃపుంజములను విరజిమ్ముచున్న నిన్నుదర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలెను, జోతిర్మయుడైన సూర్యునివలెను వెలుగొందుచున్న నీ అప్రమేయరూపము దుర్నీరీక్ష్యమై యున్నది."
బాబా భౌతిక దేహం ఈ విజయదశమినాడు కనుమరుగైనా వారి తేజోమయాదేహం సదా ప్రకాశిస్తూనే యుంటుంది.ఆశ్రీతులను, భక్తులను సదా సాయిపథంలో నడిపిస్తుంటుంది,సదా రక్షిస్తుంటుంది! సాయి చిరంజీవులు,నిత్యసత్యులు,సమాధిలో అప్రమత్తులు.
సాయిబాబా తమతేజోమయరూపాన్ని మరికొందరి యదృష్టవంతులకు అనుగ్రహించారు. వాటిలో రెండింటిని చూద్దాం.
గతసంవత్సరం రానా గిల్ అనే కెనడాలో నివసించే,పంజాబీ బాబా ప్రియభక్తుణ్ణి కలిసాను. ఆయనఆరోజు బాబాగుడిలో 3,4 గంటలపాటు తన అనుభవము,భజనలతో కూడిన ఉద్వేగపూరిత బాబా సత్సంగము నిర్వహించారు.తన అనుభవాలెన్నో చెబుతూ, బాబా తమకు అత్యంతతేజోవంతమైన అల్లా మాలిక్ దర్శనం చూపించారని ఎంతో వివులంగా వివరించారు.మరిన్ని వివరాలకు www.ranagill.com దర్శించండి.
వేరేసందర్భంలో సాయిబాబా ప్రార్ధనాసమాజ్ భక్తునికి ఓంకార తేజోమయారూపాన్ని చూపించారు.
ఈవివరాలు "సాయియే ప్రణవం " ఈ బ్లాగులోని అక్టోబర్ 5 పోస్టు లో చూసాము.
" What has life or death to do with light? In the image of my light I have made you. The relatives of life and death belong to the cosmic dream. Behold your dreamless being! Awake my child awake!"
Autobiography of a Yogi, Paramahansa Yogananda
" జీవన మరణాలకు ఆ పరంజోతితో ( వెలుగుతో) ఏమిటి సంబంధము? నా వెలుగు రూపంగా నిన్ను సృష్టించాను. చావుపుట్టుకల చక్రభ్రమణము దైవస్వప్నలీలయే. స్వప్నరహిత నీ నిజస్థితిని గాంచుము. మేలుకో బిడ్డా మేలుకో! "
ఓ యోగి ఆత్మకథ, పరమహంస యోగానంద
పైన పేర్కొన్న వివరాలన్నీ పరిశీలిస్తే స్పష్టంగా తెలిసేదేమంటే బాబా భౌతిక దేహాన్ని చాలించినా తమ చైతన్య తేజోమయ రూపంతో సదా అప్రమత్తులై భక్తరక్షణ గావిస్తున్నారు. భక్తుల విన్నపాలకు స్పందిస్తున్నారు.
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!
సమర్ధ సచ్చిదానందసద్గురు శ్రీసాయినాధ్ మహారాజ్ కి జై!
ఓంశ్రీసాయినాథాయనమః,ధున్ !
ReplyDelete1-50 of 54
శ్రీసాయిబాబా అప్రమత్తులు,వారిసమాధినుండే భక్తరక్షణ నిరంతరం కొనసాగుతొంది!