సాయినామశక్తి


శ్రీసాయినాథాయనమః 

శ్రీరామచంద్రులు కేవలము అయోధ్య వాసుల రక్షిస్తే,శ్రీరామనామము ముల్లోకాలను తరింపజేస్తుందట. అలాగే సాయిబాబా తమ భౌతిక రూపంలో ఉన్నపుడు వారి మహిమ షిరిడీ, ముంబయి , పూనా ప్రాంతాలవరకు మాత్రమే ముఖ్యంగా వ్యాపిస్తే,  బాబా మహాసమాధి అనంతరము సాయి నామ, సాయి రూప, సాయి భావ  శక్తి విశ్వమంతా వ్యాపించినది. మన జీవననావకు సాయి శక్తిని ఇంధనంగా,  సాయిని నావికునిగా మలచుకొందాము, ఒడిదుడుకుల జీవనవాహినిలొ పరమశాంతి పొందుదాము.

సాయి నామముతోడ నావసాగేనండి

సాయి నామముతోడ నావసాగేనండి
కాసింత చోటుంది వచ్చి కూర్చోరండి
భావ లహరులలోన వాహ్వళి  కెళదాము
సాయిలీలలలోన తేలియాడెదము
సాయిఓం, సాయిఓం, సాయిఓం !సాయిరాం, సాయిరాం, సాయిరాం!     ||సాయినామముతోడ||

నావికుడు సాయండి,చుక్కాని సాయండి
సాయిభక్తితోడ మలచబడినాదండి
అటునిటు వెడలదు  గురిదప్పి మరలదు
గమ్యమొచ్చేదాక రమ్యముగ సాగేను
సాయిఓం, సాయిఓం, సాయిఓం! సాయిరాం, సాయిరాం, సాయిరాం!     ||సాయినామముతోడ||

సుడులకూ  లొంగదు  తూఫాను చిక్కదు
మార్గమధ్యమున మరిఎచట నాగదు
దొంగలకు దొరకదు  దోపిడుల కందదు
గమ్యమొచ్చేదాక రమ్యముగ సాగెను
సాయిఓం, సాయిఓం, సాయిఓం! సాయిరాం సాయిరాం సాయిరాం!       ||సాయినామముతోడ||

తెరచాప సాయండి,మరలన్ని సాయండి
మంచు తెరల మధ్య  కడలి అలలా పైన
చీకటిలొ సాగేను వెలుగులా   సాగేను
గమ్యమొచ్చేదాక  రమ్యముగ సాగేను
సాయిఓం, సాయిఓం, సాయిఓం! సాయిరాం, సాయిరాం, సాయిరాం !    ||సాయినామముతోడ||

దీనులకు చోటుంది  హీనులకు చోటుంది
భక్తులకు చోటుంది  ఆర్తులకు చోటుంది
పైసలే వద్దండి సాయినే నమ్మండి
గమ్యమొచ్చేదాక రమ్యముగ సాగేను
సాయిఓం, సాయిఓం, సాయిఓం! సాయిరాం, సాయిరాం, సాయిరాం!     ||సాయినామముతోడ||

పక్షులెన్నోగూడ నావలో ఉన్నాయి
మాటలేవిరాని మృగములున్నాయి
అందరి సందడితొ నావ సాగేను
గమ్యమొచ్చేదాక రమ్యముగా సాగేను
సాయిఓం, సాయిఓం, సాయిఓం! సాయిరాం సాయిరాం సాయిరాం!       ||సాయినామముతోడ||

శాస్త్రిగారెక్కారు ఖాను కూర్చున్నాడు
సరదారు మోసెస్ లు వారితో కలిశారు
వారినవ్వులతోడ హాయిగా సాగేను
గమ్యమొచ్చేదాక రమ్యముగ సాగేను
సాయిఓం, సాయిఓం, సాయిఓం! సాయిరాం, సాయిరాం, సాయిరాం!    ||సాయినామముతోడ||

నావనిండుగనంత దీపాలు వెలిగాయి
చమురు జాడా లేదు జలముతో వెలిగాయి
వాలుగాలిలోన నావ సాగేను
గమ్యమొచ్చేదాక రమ్యముగ సాగేను
సాయిఓం, సాయిఓం, సాయిఓం! సాయిరాం, సాయిరాం, సాయిరాం !    ||సాయినామముతోడ||

శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!





Comments

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!