అద్భుత అనుభవము.(నేడు శ్రీఎక్కిరాల భరద్వాజగారి జన్మదినోత్సవము)

శ్రీసాయినాథాయనమః 

పాడవే కోయిలా 

పాడవే  కోయిలా , సాయిభావగీతికా... ||2|| 
షిరిడిసాయి సర్వకారి రామకృష్ణ రూపధారి 
భావమెటుల మనసుమెలుగ అనుభవంబె యటులని          || పాడవే కోయిలా.. .|| 

ద్వారకమయి పాపహారి పాదుకలే పుణ్యకారి 
అడుగిడినా శిరమొంచిన  
చిక్కుతొలగు వెనువెంటని....                                             || పాడవే కోయిలా.. .|| 

సాయిసత్యవంతుడులే సాయి అప్రమత్తుడులే
సామాధీ మొక్కినంత
సమాధాన మౌనని .....                                                      || పాడవే కోయిలా.. .|| 

బాబాసమాధివద్ద శ్రీఎక్కిరాల  భరద్వాజ మాస్టరుగారికి జరిగిన అద్భుత అనుభవము.

(నేడు పూజ్య శ్రీభరద్వాజ గారి జన్మదినమహోత్సవపురోజు!)  

తమతమ జీవితములు విరక్తిచెంది కేవలము బాబాసమాధి దర్శనముచే పరిపూర్ణ పరివర్తనజెంది, సాయిభక్తకోటికి మార్గదర్శకులైన పుణ్యపురుషులు కారణజన్ములు కొందరున్నారు. వారిలో అఖిలభారత సాయిసమాజ్ స్థాపకులు మద్రాస్ కు చెందిన పూజ్యశ్రీ B.V. నరసింహస్వామిగారు, ఎంతోమంది తెలుగువారిలో యిప్పటి సాయిభక్తి ప్రజ్వలనకు కారకులు,దోహదకారులైన పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు అగ్రగాములనడంలో ఎలాంటి సందేహము లేదు. ప్రస్తుతం శ్రీభరద్వాజగారు సమాధిమందిరంలో పొందిన అనుభూతిని వారిమాటల్లోనే పరిశీలిద్దాము.(శ్రీసాయిలీలామృతమునుండి గ్రహించడమైనది.)  

" ఫిబ్రవరి 1963 లో నా రెండవ అన్నగారు తనకుతోడుగా షిరిడీకి రమ్మంటే నాకెట్టి విశ్వాసములేకున్నా వెళ్ళాను. ఫిబ్రవరి 8న అచటి సమాధిమందిరంలో మేము  ప్రవేశించేసరికి ఆరతి జరుగుతుంది. అదిజూసి ఏనాడో పరమపదించిన వ్యక్తిమీద ప్రజలకు అంత భక్తివిశ్వాసాలు ఉండటం ఆశ్చర్యమనిపించింది. ఆరతి అయ్యాక అన్నగారు నాకు అచ్చటి అరుగును జూపి అది బాబాసమాధియని చెప్పగానే నాకెంతో వెగటు అనిపించింది. "ఆశరీరం ఎంతగా కుళ్ళిఉంటుందో!" అనితోచి,కడుపులో తిప్పినట్లై,వెంటనే గదికి వెళ్లి అన్నంకూడ తినకుండ నిద్రపోయాను. 

తెల్లవారి తీవ్రమైన ఆకలితో మెలకువవచ్చి త్వరత్వరగా మద్రాసుహోటలుకని సమాధిమందిరం మీదుగా వెళ్లుచున్నాను. ఆరతి,అభిషేకము అయిపోయాయి కాబోలు, అక్కడ పూజారులుతప్ప మరెవ్వరూ లేరు. జీవకళతో అచ్చటి విగ్రహాన్నిమాత్రం మరొక్కసారి చూడాలనిపించింది. మందిరంలోనికెళ్ళాను. ఆ విగ్రహంలోని బాబాముఖం చూస్తుంటే అందులోని సాయి చూపు అంతర్ముఖమై, ఎదో అతీతమైన స్థితిలో వున్నట్లు తోచింది.ఆ స్థితిలో ఆయనకు తననుండి వేరుగా ఈ సృష్టి ఉన్నట్లు తోచివుండదని, విశ్వమంతా ఏ మహత్తరమైన చైతన్యంలో సంకల్పమాత్రంగా వున్నదో, దానితో ఆయన తాదాత్మ్యం చెందివున్నారనిపించింది. ఇది కేవలం భావంగా గాక ఒక అనిర్వచనీయమైన అనుభవంగా నాహృదయాన్ని కబళించింది. నాచుట్టూ, నాలోపల ఏమి జరుగుతున్నదో తెలియలేదు.  


 ఆలా ఎంతసేపు జరిగిందో తెలియలేదు. కొంతసేపటికి తుళ్ళిపడి లేచాను. మా అన్నగారు నా వీపుతట్టి భోజనానికి రమ్మంటున్నారు. ఆస్థితిలోనుంచి మేల్కొనడమెంతో బాధనిపించింది. టైముచూస్తే నేనక్కడికివచ్చి షుమారు 5 గంటలైంది. అంతసేపు నేను నిలబడి విగ్రహాన్ని చుస్తున్నాననుకొన్నాను;నిజానికి కూర్చుని వున్నాను. కళ్లుమూతబడి వున్నాయి. భోజనానికి వెళుతూ వుంటే కలలో నడుస్తున్నట్లుంది. గాఢనిద్రలో లేపితే తిరిగి మనస్సు నిద్రలోకి మళ్లినట్లు నా మనస్సు అప్రయత్నంగా నిరామయమౌతున్నది. వస్తువులను గుర్తించాలన్నా,యోచించాలన్నా, ఎంతో ప్రయత్నం చేయవలసి వస్తున్నది. ఇల్లుచేరి కొద్దినెలలు గడిచినా నా స్థితి అలానే ఉండిపోయింది. గాఢమైన శాంతి, ఆనందాలతో రోజులు, నెలలు క్షణాల్లా గడచి పోయేవి. జగత్తంతా  చైతన్యమయంగా తోచేది."

ఆక్షణాలు మరువలేనివి, మరపురానివి. సద్గురుసాయి ఓ తీవ్ర ముముక్షువు  మాస్టరుగారిని జ్ఞానిగా, మహాజ్ఞానిగా మార్చిన మధుర మనోజ్ఞ నిముషాలు. ఆ తరువాతభరద్వాజమాస్టరుగారు  'బాబాకి బేటా' అంటే బాబాప్రియపుత్రులు అనిపిలువబడే స్థాయికి ఎదిగారు. శ్రీసాయిలీలామృతము,శ్రీగురుచరిత్ర, సాయిసన్నిధి, సాయిప్రబోధామృతము లాంటి ఎన్నో పవిత్ర మహత్తర  గ్రంథముల రచనజేసి  వేలాది,లక్షలాది సామాన్యులను సద్గురుసాయి మార్గంలో నడిపి ఉన్నత సాయిభక్తులగుటకు కారణజన్ములైనారు. ఈరోజు పరమపూజ్య  శ్రీభరద్వాజ మాస్టరుగారి పవిత్ర జన్మదినము. ఈశుభతరణంలో సమర్ధసద్గురు శ్రీసాయినాథమహారాజులకు, శ్రీభరద్వాజామాస్టరుగారికి మనఃపూర్వక  వినమ్ర  హృదయకుసుమాంజలి అర్పిస్తున్నాను. 

 శ్రీసాయి కరుణా కిరణాలు అందరిపై ప్రసరించుగాక!
అందరికి శుభమగుగాక!
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!




ఈ క్రిందనివ్వబడిన లింకున తెలుగులో శ్రీభరద్వాజగారి సందేశోపన్యాసము, 'సుప్రభాతము' ఆడియో వినండి. పూర్తివివరములకు SaiBharadwaja.org సందర్శింపగలరు. 
http://www.saibharadwaja.org/audiovideos/telugu/01.%20Suprabhatam.mp3


Comments

  1. నేడు సాయిభక్తిమార్గదర్శి పూజ్యశ్రీ ఎక్కిరాలభారద్వాజగారి పవిత్రజన్మదినము.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!