శ్రీసాయి చాలీసా
శ్రీసాయినాథాయనమః
చక్కెరతో చేసిన ఏ వంటకమైనా తియ్యగా ఉంటుంది. మహనీయుల చరితలు ఏలా చదివినా మధురంగా ఉంటాయి. శ్రీసాయి చరిత, చాలీసా రూపంలోచదివి ఆనందిద్దాం!
శ్రీసాయి చాలీసా
షిరిడీనాథులు స్థిరముగ మనమున తా వెలుగై అలరగ
అత్రి అనసూయ ప్రియపుత్రుండు సత్వరూపుడు దత్తాత్రేయుడు
అవనిలొ వెలసెను సాయిరూపుగ ఆర్తులనాథల బాధల దీర్పగ
పదునారేండ్ల బాలభాస్కరునిగ షిరిడీనగరిలొ దర్శనమిచ్చెను
ఆకు పసరుల మందుల నిచ్చెను మరిఅంతటను షిరిడిని వదలెను
చాందు పాటీలు హయమది యచట వింతగ ఎచటికొ మాయమాయెను
అటునిటు వెదకగ కనరాదాయెను ఎటుల ఎటులని పాటిలు వగచెను
మనసను హయమును గురువు పట్టెను కాలువగట్టున మేయగ జూపెను
చాందు పాటీలు విస్మయ మందెను తన అశ్వంబును తిరిగి పొందెను
చిలుము పీల్చగ గురుదేవుండు సృష్టిజేసెను నీరునిప్పును
చాందుపాటిలా లీలను గాంచెను గురుచరణంబుల మోకరిల్లెను
పెండ్లి నెపమున తానరుదెంచెను గురుదేవుండు షిరిడీపురముకు
మాల్సాపతి యట గురుని గాంచెను ఈశుని రూపని మనసున దలచెను
ఆత్మరూపుని యచట కనగనె ఆతని దేహము తన్మయమాయెను
"సాయి.... సాయను " నామము వెడలెను సాయిదేవుడు షిరిడిలొ వెలసెను
కళ్యాణము తాజాడగ వచ్చి లోకకళ్యాణము తా నొనరించెను
షిరిడియె కలి వైకుంఠమాయెను నిత్యకల్యాణ పచ్చతోరణముగ
నింబవృక్షము వేదికజేసి ధ్యానముద్రలో తా గూర్చుండెను
భావాతీతము పొందుచు తాను భగవంతునిగా వెలుగు చుండెను
కుండల నిండుగ నీరు మోయుచు చుట్టూమొక్కల తోట పెంచెను
ఉచితముగాను వైద్యము జేయుచు రోగులనాథల ఆర్తి బాపెను
కఫ్నిధరించిన కరుణామయుడు వైరాగ్యమును ఇలలో జూపెను
మనసులొ తానే మహరాజైనను ఫకీరు వేషము తాను దాల్చెను
మజీదు సాయికి మందిరమాయెను ద్వారకామాయని నామము పొందెను
గీత ఖురానుల పఠనము సాగెను సర్వధర్మముల సంగమమాయెను
అచ్చట సాయి అగ్నిని కొలచెను ధుని రూపంబుగ నిరతము వెలుగగ
భక్తుల పాప కర్మలెల్లను యజ్ఞ హవిస్సుగ తా నర్పింపగ
ధుని యందించిన దివ్య విభూతిని మహిలో పంచెను మహిమలు చూపగ
లీలగ రోగములెన్నో దూరము భవరోగంబును సన్నగిల్లెను
వీధి వీధుల బిచ్చమడుగుతూ కర్మఫలంబుల స్వీకరించెను
నల పాకంబుల తా నందించుచు అన్నదాతగా ఖ్యాతి గాంచెను
తిరుగలి పట్టెను బరబర ద్రిప్పెను గోధుమలందున వడివడి విసరెను
భక్తుల పీడలు చరగున దొలగెను కలరామారియు వెడలిపోయెను
చమురు లభింపక జలముతొ నింపెను ఆ జలంబుల దివ్వెలు వెలిగెను
వణిజులెల్లరూ అచ్చెరువొందిరి గ్రక్కున సాయి పాదము మొక్కిరి
శివుడే తానుగ అల్లా తానుగ రామకృష్ణ హనుమాదులు తానుగ
ఇష్టదైవముల రూపు దాల్చుచు భక్తులెల్లరకు.. భగవానుడాయెను
శునక రూపున రొట్టెను పొందెను మూగజీవుల తోడ భుజించెను
అన్నివేషముల తానుగా నుండెను ఆత్మతేజమై అన్నిట యలరెను
ఎచ్చటెచ్చటో భక్తుల ఇండ్లలొ భోజ్యములెన్నో ఆరగించుచు
మజీదు గూర్చుని కడుపునిండెనని వారిముఖంబుల తాను బలికెను
దూర దూరముల దాసుల బ్రోవగ చిత్రపటంబుల తాను వెడలెను
ఏమి చిత్రమో ఏమిలీలయో సాయినాథులు సర్వ వ్యాపకులు
మల్సాపతి యంకము తలనిడి మూడుదినంబులు జీవము విడచెను
చరమాంకంబని యెల్లరు వగచగ మెల్లగ లేచెను భగవన్మహిమగ
అక్షయరూపులు సాయిదేవులు గీతకు భాష్యము చెప్పిరిలే
ఉపనిషత్తుల సారముగూడ చిట్టికథలలో గూర్చిరిలే
ఆస్తికులైరి నాస్తికులెందరొ సాయిని పరీక్షింపగ వచ్చి
ఫకీరు ఫకీరని తలచిన ఎందరొ పరమాత్మునిలా యనుభవమొందిరి
జీవుల సర్వా భాషలు నేర్చెను పాముకప్పల పోరును ఆపెను
క్రూరజంతువులు శాంతములాయెను చల్లని సాయి చూపులంటగ
దక్షిణలెన్నో స్వీకరించెను భక్తుల తాము రక్షింపగను
దానధర్మముల వెచ్చించుచును వారి జనముల తీర్చి దిద్దుచును
సరిపోల్చగ శ్రద్ధ సబూరిలు రెండు నాణెముల దక్షిణ పొందెను
నవవిధ భక్తుల కలిగియుండమని తొమ్మిది నాణెము లప్పగించెను
సర్వ జీవుల బాధల పొందెను ప్లేగుబొబ్బల మేనిని దాల్చెను
కొలిమి మంటలో చేయి గాల్చెను బిడ్డప్రాణమును వింత గాచెను
పంచ భూతముల పంచను నిలిపెను పంచ పాపముల భారము దీర్చెను
పంచేంద్రియముల పగ్గములందుచు పార్థసారథిగ పరమందించెను
తారతమ్యములు తనకేలాయని మతభేదంబులు మనసు కేలయని
రామనవముల తా జరిపించెను చందన వేడుక జతగ జేయుచు
జన్మాష్టములు గురుపున్నములు చావడి పండుగ లెన్నియెన్నియో
ఏమిపుణ్యమో ఏమి జన్మయో ! సాయితొ గడిపిన ధన్య జీవులకు
రాజయోగమున సిద్ధి పొందెను యోగిరాజని ప్రసిద్ధినొందెను
ఖండయోగము తానొనరించెను బ్రహ్మాండమును తానై నిండెను
రెండుగ విలసిలు భక్త హృదయముల తా శయనించెను చావడి జేయుచు
ఓ యన ఓ..యని పలికే సాయిగ తక్షణ రక్షణ సాయము సేయుసు
లోకవ్యాపకములు సాయిలీలలు కలియుగ మాయను బాపే తారలు
నాలుగు దిశలా సాయి నామములు నాలుగు వేళల మంగళారతులు
ఎన్నిలీలలో ఏమిలీలలో ఎల్లలు దాటిన సాయిలీలలు
భక్త హృదయముల కొల్లగొట్టుచు చల్లగ వీచే మలయ పవనములు
గురుని గురుతగు ఇటుక విరిగెను తనదేహంబిక చాలని తలచెను
తాత్య జ్వరమును తాను పొందెను భయ్యాజి వొడిలో ఒరిగిపోయెను
వగచుట వగచుట వలదు వలదు యని సాంత్వన వచనముల సాయి బలికెను
సమాధినుండే భక్తుల గాచుచు అప్రమత్తుడై యలరుచు నుండెను
నాలుగు వేళల అరతులందుచు ఎల్లవేళల లీలగ బ్రోచుచు
విశ్వవ్యాపకులె సాయినాథులు విశ్వపాలకులె సద్గురు దేవులు
అభయ ప్రదాత ప్రేరణ విరిసిన సాయిలీలల పరిమళ సుమములు
ఆలపించినా అష్టసంపదలు ఆలకించినా యిష్ట ఫలంబులు!
ఓం మంగళమ్ సాయినాథాయ మహనీయ గుణాత్మనే
సర్వభక్త శరణ్యాయ శ్యామ రక్షాయ మంగళమ్ !
శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక !
అందరికి శుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి !
అందరికి శుభమగుగాక !
ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి !
హనుమాన్ చాలీసా!
శ్రీమన్నారాయణ నారాయణ హరీ హరి!
" ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో, ఉభయులును సాయిబాబా అనుగ్రహము పొందెదరు. " శ్రీసాయిసచ్చరిత్ర.
ReplyDelete