శ్రీసాయి రక్షణామార్గము

శ్రీసాయినాథాయనమః 

జ్ఞానసాగరి శ్రీమద్భగవద్గీత, భక్తిప్రదాయిని శ్రీమహాభాగవతము, శక్తివాహిని శ్రీసాయిసచ్చరిత్రముల ముఖ్యసందేశములనొకసారి పరిశీలించెదము. 

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం   గీత: 9-22

(ఏ పరమభక్తులు ఇతర చింతలు లేనివారై, పరమదైవమగు పరమాత్మనగు నన్ను ఎల్లప్పుడును ధ్యానించువారై సేవించుచున్నారో, అట్లు సర్వకాలముల యందు సమాహితచిత్తులైన వారియొక్క యోగక్షేమములను నేను వహించుచున్నాను.)

పానీయంబుల్ ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీ
లానిద్రాదులు సేయుచుం దిరుగుచున్ లక్షించుచున్ సంతత
శ్రీనారాయణ పాదపద్మ యుగళీ చింతామృతా స్వాదనం
ధానుండై మరచెన్ సురారిసుతుడేతద్విశ్వమున్  భూవరా!            శ్రీమహాభాగవతము: సప్తమస్కంధము -123 

శ్రీశుకమహర్షి రాజా పరీక్షిత్తుతో యిట్లుచెబుతున్నారు, " ఓ రాజా! విష్ణువైరి హిరణ్యకశిపు పుత్రుడు ప్రహ్లాదుడు పానీయములు సేవించుచు, భోజనములు తినుచు,భాషించుచు, హాస్యమాడుచు ,నిద్రించుచు,అటునిటు దిరుగుచు, చర్చించుచు, యిత్యాది నిత్యకార్యములు జేయుచున్నను, శ్రీనారాయణ పాదపద్మ స్మరణామృత స్వాదనముజేయుచు, బాహ్యప్రపంచమును  మరచినాడు."

" ప్రేమతో నా నామమునుచ్చరించిన వారికోరికలన్నియు నెరవేర్చెదను. వారి భక్తిని హెచ్చించెదను. వారి నన్ని దిశలందు కాపాడెదను. ఎవరైతే మనః పూర్వకముగా నాపై పూర్తిగా నాధారపడియున్నారో వారీకథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయువారికంతులేని యానందమును శాశ్వితమైన తృప్తిని ఇచ్చెదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తివిశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నారూపమును తమ మనస్సున నిలుపుకొనెదరో, వారిని దుఃఖబంధనములనుండి తప్పింతును. ప్రాపంచిక విషయములనన్నిటిని మరచి, నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను, చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడు నన్ను జ్ఞప్తియందుంచుకొనువారు ప్రపంచవిషయములందెట్లు తగులుకొందురు? వారిని మరణమునుండి బయటకు లాగెదను. నా కథలు వినినచో సకలరోగములు నివారింపబడును. కావున భక్తిశ్రద్ధలతో నా కథలను వినుము. వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము. నా భక్తులయొక్క గర్వాహంకారములు నిష్క్రమించును. నా లీలలు వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధచైతన్యముతో తాదాత్మ్యము కలుగును. ' సాయి సాయి ' యను నామమును జ్ఞప్తియందుంచుకొనిన మాత్రమున, చెడు పలుకుటవలన, వినుటవలన కలుగు పాపములు తొలగిపోవును."         శ్రీసాయిసచ్చరిత్రము: 3 వ అధ్యాయము 

కావున శ్రీమద్భగవద్గీత, శ్రీమహాభాగవతము, శ్రీసాయిసచ్చరిత్రముల పరిశీలించిన యనంతరము మనకు స్ఫురించే  సందేశమొక్కటే! మన పంచేంద్రియములు తమ తమ పనులతో సతమతమైనప్పటికీ శ్రీహరినామస్మరణము, శ్రీగురునామస్మరణను సదా మరువనియెడల భవసాగరమును సులభముగా దాటి, పరమశాంతిని పొందగలము. సాయి సదా మనలవెన్నంటియే మసలును. ఇదియే శ్రీసాయి రక్షణామార్గము,రహస్యమూను! 

శ్రీసాయిని  సర్వస్యశరణాగతికోరి  వారికి సర్వమర్పించిన ఎందరో భక్తులను శ్రీసాయిసచ్చరిత్రలో చూడవచ్చును. వీరిలో ముఖ్యులు కాకాసాహెబ్ దీక్షితు, దాసగణు,హేమాద్ పంతు, శ్యామా, నానాసాహెబు చందోర్కరు, మేఘా, లక్ష్మీబాయి షిండే మున్నగువారు. అందరికంటే బాబాతో శ్యామా సాన్నిహిత్యము చెప్పుకోదగ్గది. తన ప్రతిశ్వాసలోను సాయిని నింపుకొని, చివరకు సాయిలో ఐక్యమైనాడు.  శ్యామానుగూర్చి శ్రీ ఖాపర్డే తన డైరీలో ( డిసెంబర్ 8, 1911) న యిలా వ్రాసికొన్నాడు," మాధవరావు దేశ్ పాండే యిక్కడ నిద్రపోతున్నాడు. నేనెన్నడూ చూడనిది, నాచెవులతో విననిది, గ్రంధాలలో మాత్రమే చదివిన విశేషమొకటి చూచాను. అతనియొక్క ప్రతి ఉచ్చ్వాస నిశ్వాసలోను   స్పష్టంగా , ' సాయినాథ్ మహరాజ్ , సాయినాథ్ బాబా' అన్న శబ్దం స్పష్టంగా విన్పింస్తోంది. అతడు గురక పెడుతున్నప్పుడు అదెంతో దూరానికి విన్పిస్తున్నది. ఇదెంతో ఆశ్చర్యకరమైన విషయం".

ఎల్లప్పుడూ భగవంతుని గుర్తుపెట్టుకోవడానికి ఈ  ఉపమానము ఉపయోగపడుతుంది.  బిందె నెత్తినపెట్టుకొని నర్తించే నర్తకి , తాళానికి అడుగులు, గాత్రానికి అభినయం , ప్రేక్షకుల కోలాహలానికి చిరునవ్వు, వాద్యకారుల లయకు భంగిమలు, అన్నీ చేస్తున్నా తనదృష్టి నెత్తిమీదవున్న 'బిందె' మీద ఎలాలగ్నం చేసి నర్తిస్తుందో, అలాగే మనంకూడా ఎలాంటి విరామందొరకని నిత్యకృత్యాలలోగూడా, బొమ్మవెనుక తెర విధంగా  భగవంతుని మన పనులవెనుక నిలుపుకోవాలి. 
పైచెప్పబడిన భావములకు ప్రతిబింబముగా కూర్చబడినదే, యీ క్రింది భావగీతిక.

కనులుమూసినా నీదురూపమే

కనులుమూసినా నీదురూపమే
కనులుతెరచినా  నీదురూపమే
మనసు కొలను లో నీదు బింబమే
అలల పరుగులా  లీల తలపులే
నీ.....  లీల తలపులే

ఊహలందునా..  నీదు ఊసు యే
శ్వాసలందునా .. నీదు ఊయలే
నాడు లన్నిటా .. నీదు నామమే                     ||మనసు కొలను లో||

పెదవి పలుకులా ..నీదు భజనయే               
తనువు పులకలా ..నీదు భావమే
హృదయ వీణియా ..నీదు గానమే                   ||మనసు కొలను లో||

వింత వింతలే ..నీదు మహిమలు
చెవుల సోనలే ..నీదు గాథలు
వెలుగు జిలుగులే  ..నీదు చేష్టలు                   ||మనసు కొలను లో||   

28-07-2011, గురువారము

శ్రీసాయి కరుణాకిరణాలు అందరిపై ప్రసరించుగాక!అందరికీశుభమగుగాక!ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!


Comments

  1. హరికృప, గురుకృప పొందుటకు భగవద్గీత, భాగవతము, శ్రీసాయిసచ్చరిత్రలలో చెప్పబడిన అమూల్య బోధ.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

శ్రీ సాయి అష్టకము (Sri Sai Ashtakam with English translation )

సాయి మంగళం! ( ఆరతి సాయిబాబా!)

Commonality in the messages of Jesus Christ and Shirdi Sai Baba!